
126 కిలోల గంజాయి స్వాధీనం
అల్లిపురం(విశాఖ): ఏజెన్సీ ప్రాంతం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరి పరారవగా, 126 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర శాంతిభద్రతల డీసీపీ–2, డి.మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో దువ్వాడ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గంజాయి బీట్ సిబ్బంది కూర్మన్నపాలెం, స్టీల్‌సిటీ ఆర్టీసీ డిపోవద్ద నిఘా వేశారు. దీంట్లో భాగంగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గమనించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 6 బ్యాగులలో 126.940 కేజీల గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన భరత్ సింగ్, రాజ్‌సింగ్‌లు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. రాజ్‌సింగ్ స్నేహితుడు అమిత్ కుమార్ సింగ్ ముందుగా విశాఖ చేరుకున్నాడు. ఇక్కడ రూం అద్దెకు తీసుకుని దుస్తుల వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి కొనుగోలు చేశాడు. పని పూర్తయిన తరువాత తన మిత్రులైన భరత్‌సింగ్, రాజ్‌సింగ్‌ను విశాఖ రమ్మన్నాడు. వీరు ముగ్గరూ గంజాయితో ఢిల్లీ వెళ్లేందుకు కూర్మన్నపాలెంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కేందుకు ఆటోలో వేచి ఉండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. అయితే వారిలో అమిత్‌సింగ్, రాజ్‌సింగ్ పరారవగా..భరత్‌సింగ్ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి 126.940 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.