
గుదిబండ..!
సామాన్యులకు
సాక్షి, పాడేరు: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.50 పెంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ గ్యాస్ వినియోగం అధికంగా ఉంది. ఓ వైపు ఆదాయం పెరగక పోగా.. మరోవైపు ఖర్చులు మాత్రం అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ ధరను పెంచడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 2.98 లక్షల కుటుంబాలకు గాను 1.80 లక్షల కుటుంబాలు గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. కిరోసిన్ పంపిణీ రద్దయిన తరువాత మధ్య తరగతి కుటుంబాలు గ్యాస్ వినియోగానికి అలవాటు పడ్డాయి. 85 శాతం జనాభా ఉన్న గిరిజనుల్లో 60 శాతం మంది గ్యాస్‌ను వినియోగిస్తున్నారు.
ప్రతి నెలా ఒక సిలిండర్‌ను పూర్తి చేసే వినియోగదారులు అధికంగా ఉన్నారు. ఈ లెక్కన ప్రతి వినియోగదారుడికి నెలకు రూ.50 అదనంగా ఖర్చవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ను ఏడాదికి మూడు సిలెండర్ల చొప్పున పంపిణీ చేసినా మరో 7 నుంచి 9 సిలిండర్లు అవసరమవుతాయి. ప్రస్తుతం పెంచిన గ్యాస్ ధరల ప్రకారం ఏడాదికి రూ.350 నుంచి రూ.450 వరకు వినియోగదారులపై భారం పడుతుంది. ఏడాదికి వినియోగదారులపై రూ. 8.10కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.811. తాజాగా రూ.50 పెంచడంతో రూ.861కు చేరింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ గిరిజన కుటుంబాలు పేదలేనని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ధర విషయంలో తగిన న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
రూ.50 పెరిగిన
గ్యాస్ సిలిండర్ ధర
ఏడాదికి
రూ.8.10 కోట్ల
భారం
జిల్లాలో కనెక్షన్లు 1,80,000
గ్యాస్ ధర పెంపుతో అదనపు భారం
గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచడంతో అదనపు భారం పడింది. గ్యాస్ ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వాలు ఇలా తరచూ పెంచుకుపోతున్నాయి. గ్యాస్ వినియోగం పెరిగిన నేపధ్యంలో ధరలు పెంచడం బాధాకరం.
– జి.రమేష్, గ్యాస్ వినియోగదారుడు, పాడేరు
అదనపు భారం మోయలేం..
ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో అవస్థలు పడుతున్నాం. ఈ సమ యంలో ఉన్నట్టుండి గ్యాస్ బండ ధరను అదనంగా రూ.50 పెంచడం తగదు. ఈ భారాన్ని పేదలు మోయలేరు. ప్రభుత్వం దీనిని భరించాలి. పాత ధరకే గ్యాస్‌ను విక్రయించాలి. – సుమర్ల బంగారమ్మ, బూదరాళ్ల
రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఆ మొత్తాన్ని భరించాలి. ప్రతి నెలా గ్యాస్ బుక్ చేసుకునే సమయంలో రూ.50ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి పేదలకు న్యాయం చేయాలి.
– ఈశ్వరమ్మ, చింతపల్లి

గుదిబండ..!

గుదిబండ..!

గుదిబండ..!