
సూర్యప్రభ వాహనంపై సింహాచలేశుడు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 5వరోజు శుక్రవారం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం సింహగిరి మాడ వీధిలో తిరువీధి నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవ్‌లోచన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి మృగయోత్సవం నిర్వహించనున్నారు.