చదువుకున్న భార్య ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనని నిర్దాక్షణ్యంగా... | - | Sakshi
Sakshi News home page

చదువుకున్న భార్య ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనని నిర్దాక్షణ్యంగా...

May 15 2023 1:44 AM | Updated on May 15 2023 1:44 PM

- - Sakshi

అనకాపల్లి: చదువుకున్న భార్య ఉద్యోగం చేస్తూ ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనన్న అనుమానం. తనకు ఫోన్‌ వాడడం రాదు, ఆమె ఫోన్‌ వాడుతోంది...ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందో ఎక్కడ తన చేయి దాటిపోతోందోన్న ఆత్మనూన్యతా భావం...వెరసి అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను నిర్దాక్షణ్యంగా చంపేశాడు. నక్కపల్లి మండలం చీడిక గిరిజన గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీడికకు చెందిన చీడిక నాగేంద్రకు వరుసకు మరదలు అయ్యే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన రాజ్యలక్ష్మి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది.

ఆ సమయంలో కట్న కానుకలు బాగానే ఇచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాజ్యలక్ష్మి డిగ్రీ చదువుకుంది. నాగేంద్ర చదువుకోలేదు. ఏ పనిపాటా లేకుండా తిరుగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో పూట గడవడం కష్టమై పాయకరావుపేటలో ఒక ప్రైవేటు వస్త్ర దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా చేరింది. అవసరార్థం సెల్‌ఫోన్‌ కూడా కొనుక్కుంది. అయితే భార్య ఉద్యోగం చేయడం, ఫోన్‌ ఉపయోగించడం తరచూ ఫోన్‌కాల్స్‌ మాట్లాడడంతో నాగేంద్రలో అనుమానపు బీజాలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధింపులు భరించలేక భార్య కొద్దిరోజులపాటు పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సర్ది చెప్పి ఇద్దరినీ కలిపారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత ఒత్తిడి చేసి ఆమెను ఉద్యోగం మాన్పించాడు.

అయితే ఆమె తన కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడడాన్ని నాగేంద్ర అనుమానించేవాడు. శుక్రవారం రాత్రి రాజ్యలక్ష్మి ఫోన్‌ మాట్లాడుతుండంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎప్పటి నుంచో భార్యపై అనుమానం పెంచుకున్న నాగేంద్ర కత్తిపీట చెక్కను తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో బలమైన గాయమై రక్తపు మడుగులో పడిపోయిన తల్లిని చూసి ఇద్దరు పిల్లలు భయంతో కేకలు వేశారు. విషయం చుట్టుపక్కల వారికి తెలిసి వారు వచ్చే చూసేటప్పటికే ఆమె రక్తపు మడుగులో ప్రాణాలొదిలింది. నాగేంద్ర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

స్థానికులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరావు, ఎస్‌ఐ శిరీష సంఘటన స్థలానికి వెళ్లి క్లూస్‌ టీం సాయంతో వివరాలు సేకరించారు. ఇద్దరి మధ్య కొద్దినెలలుగా జరుగుతున్న ఘర్షణను ఇద్దరు పిల్లలు, స్థానికులు పోలీసులకు తెలిపారు. భార్యపై అనుమానంతోనే నాగేంద్ర ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు.

అమ్మ లేక అనాథల్లా మారిన పిల్లలు
కళ్ల ముందే కన్న తల్లిని తండ్రి నిదాక్షిణ్యంగా హత్య చేయడంతో ఇద్దరు చిన్నారులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఏం జరిగిందో, ఏం చెప్పాలో అని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తల్లి మృతదేహం ముందు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. అమ్మనాన్నల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ అమ్మ వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది. తండ్రి జులాయిగా తిరుతున్నా ఏ లోటు లేకుండా తల్లి చూసుకునేదని, ఇప్పుడు ఆమెను తండ్రి పొట్టన పెట్టుకోవడంతో పిల్లలు అనాథలయ్యారని చుట్టు పక్కల వారు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement