
అనకాపల్లి టౌన్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో భార్య తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. గాజువాక ఎస్‌ఐ కొల్లి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన దాసరి సత్తిబాబు, భార్య అపర్ణ (26) ఉపాధి కోసం అనకాపల్లి ప్రాంతానికి ఐదు సంవత్సరాల క్రితం వలస వచ్చారు. పట్టణంలోని అంజయ్యకాలనీలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు.
వీరికి భరత్ (6), షణ్ముఖ్ (4) సంతానం. పిల్లలు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నారు. సత్తిబాబు పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలోని దొండపర్తి వద్ద ఉన్న బంధువులను కలిసేందుకు సత్యం, అపర్ణ సోమవారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీ బీహెచ్‌పీవీ సిగ్నల్ పాయింట్ దాటి నాతయ్యపాలెం సమీపిస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీ వెనుక కూర్చున్న అపర్ణ తూలి రోడ్డుపై పడగా ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
భర్త సత్యంకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య మృతి చెందడాన్ని చూసిన సత్యం రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న గాజువాక ఇన్‌చార్జి సీఐ వి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ కొల్లి సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయాలపాలైన సత్యంను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ తెలిపారు. ఈ దుర్ఘటనతో అనకాపల్లి అంజయ్యకాలనీలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment