
పోస్ట్.. అనే పిలుపు కోసం ఎదురు చూసిన క్షణాలు గుర్తున్నాయా.. అభిమాన లేఖలు, సమాచారం మోసుకొచ్చిన ఉత్తరాలు అందుకొని అపురూపంగా చదువుకొని ఎన్నాళ్లయిందో.. మనసులోని భావాలను కాగితంపై పెట్టి అందమైన దస్తూరితో అవతలి వారికి చేరవేయడం ఈ తరం వారికి తెలీనే తెలీదు. సెల్‌ఫోన్ మెసేజ్‌లు, ఈ–మెయిళ్లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం నేటి ట్రెండ్. అందుకే ఉత్తరాన్ని ఓసారి గుర్తు చేద్దామని తపాలా శాఖ తలపెట్టింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. కలం కదిలించండి.
బహుమతులు ఇవీ..
విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (12 మందికి మించకుండా) నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు వరుసగా రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారి లేఖలను జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందిస్తారు.
అనకాపల్లి రూరల్: నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. పెన్ను, పేపర్ పట్టి లేఖ రాయడం అందరూ మరిచారు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సమస్త సమాచారం క్షణాల్లో తెలుసుకొనే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉత్తరాలు కొనుగోలు చేసి బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వదస్తూరితో లేఖలు రాసేవారు. నేటితరానికి ఆ అవసరం లేకుండా పోయింది. ఆనాటి సమాచార సాధనం గురించి యువతరానికి తెలపాలని, మరిచిపోయిన ఆనాటి తరానికి గుర్తు చేయాలని తపాలాశాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో థాయి ఆఖర్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది.
ఎవరు పాల్గొనవచ్చంటే..
భారతదేశ పౌరులెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. 18 ఏళ్ల లోపు వారిని ఒక కేటగిరీగా, 18 ఏళ్ల పైబడిన వారిని మరో కేటగిరీగా పరిగణిస్తారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు ,అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చాలి. ఏ4 సైజు పేపరుపై రాసి ఎన్వలప్ కవర్‌లో ఉంచి పంపించవచ్చు. లేదా ఇన్‌లాండ్ లెటర్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌లాండ్ లెటర్‌లో అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. చేతితో రాసి వ్యాసం పంపాలి. లేఖలను పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయసు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ‘ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ–520013’ చిరునామాకు అక్టోబరు 31 లోగా పంపించాలి.
విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది
విద్యార్థుల్లో ఇలాంటి కార్యక్రమాలు పోటీతత్వాన్ని పెంచుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఈ పోటీపై అవగాహన కల్పిస్తున్నాం. ఆంగ్లం, హిందీలతోపాటు స్థానిక భాషల్లో కూడా వ్యాసం రాయవచ్చు. డిజిటల్ యుగంలో స్వదస్తూరితో ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది. మళ్లీ దానిని అలవాటు చేయడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయి.
–సంజయ్ కుమార్ పాండా, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్, అనకాపల్లి డివిజన్
మంచి అవకాశం
తపాలాశాఖ రూపొందించిన ఈ ఉత్తరాల పోటీ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశం. అన్ని వయసులవారూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్టు చేయాలి. మా ఇన్‌స్పెక్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు, బీపీఎంలు పోటీపై ప్రచారం చేపడుతున్నారు.
–జనపాల ప్రసాద్‌బాబు, పోస్టల్ సూపరింటెండెంట్, అనకాపల్లి డివిజన్
Comments
Please login to add a commentAdd a comment