చోడవరం మండలంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డ్వాక్రా మహిళలు
చోడవరం : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం మండలంలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఆసరా పథకంలో 4వ విడతగా రూ.14.73 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు ధర్మశ్రీ శుక్రవారం అందజేశారు. ఇక్కడ శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలాది మంది డ్వాక్రా మహిళలు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ప్రధానంగా మహిళల సాధికారత, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు దశలవారీగా రుణమాఫీ చేస్తుండగా మరో పక్క సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ వడ్డీని ప్రభుత్వమే భరించే విధంగా సహకారం అందిస్తున్నారన్నారు. సున్నా వడ్డీతోపాటు ఆసరా పథకంలో మంజూరైన డబ్బులు నేరుగా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేసి మహిళలకు అండగా ముఖ్యమంత్రి నిలిచారన్నారు.
గతంలో చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాలను విడిపిస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడని ధర్మశ్రీ విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల ముందు పసుపు కుంకుం పేరుతో మహిళలను చంద్రబాబు మభ్యపెట్టాలని చూసినప్పటికీ ఆయనకు బుద్ధి చెప్పి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో మహిళలు పూర్తి సహకారం అందించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా పథకాలన్నీ పార్టీలకు అతీతంగా ప్రజల ఇంటి ముందుకే తెచ్చి అందిస్తుందన్నారు. ఇది ప్రచారాల ప్రభుత్వం కాదని, ఇది ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు.
మహిళలకు మరింత మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలని ధర్మశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ రత్నప్రభ, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, డీసీఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగరావు, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ , ఉప సర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, మహిళా విభాగం అధ్యక్షురాలు యర్రా దేవి, పట్టణ మాజీ అధ్యక్షురాలు అల్లాడ భవానీ, ఈఓపీఆర్‌డి చైతన్య, వెలుగు ఏపీఎం కనకరాజు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మాయగాడు చంద్రబాబు..
బుచ్చెయ్యపేట : డ్వాక్రా రుణాలు బ్యాంకులకు కట్టొద్దని మహిళల్ని మోసగించిన మాయగాడు చంద్రబాబునాయుడైతే ఆసరా నగదు అందించి ఆదుకున్న మొనగాడుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. శుక్రవారం దిబ్బిడి గ్రామంలో బుచ్చెయ్యపేట మండలానికి మంజూరైన నాల్గో విడత ఆసరా నగదు రూ, 7.60 కోట్లు నగదు చెక్కును మహిళలకు ఆయన అందించారు. 2014లో చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలెవరూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, బంగారు రుణాలు తిరిగి కట్టొద్దని, అధికారంలోకి వస్తే రూ.13,800 కోట్లు మహిళల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గద్దె నెక్కిన తరవాత చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసగించాడన్నారు.
ప్రజా సంకల్పయాత్రలో జగనన్న హామీ ఇచ్చిన నవరత్నాల పథకంలో భాగంగా మహిళల బ్యాంకు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసి ఆదుకున్నాడన్నారు. చంద్రబాబు అప్పట్లో ఉన్న అప్పు రూ.13,800 కోట్లు కట్టకపోవడంతో వడ్డీతో జగనన్న రూ, 25,532 కోట్లు బ్యాంకులకు కట్టి అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారన్నారు. మాట మీద నిలబడే జగనన్నకే మహిళంతా పట్టం కట్టాలని, సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. చోడవరం నియోజకవర్గంలో రూ.168 కోట్లు డ్వాక్రా రుణాలను మాఫీ చేసి ఆసరా ద్వారా నాలుగు విడతలుగా అందించడమే కాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని విప్ ధర్మశ్రీ కోరారు.
కార్యక్రమంలో చోడవరం వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు చొక్కాకుల వెంకటరావు, ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి, జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కె.అచ్చింనాయుడు, వైస్ ఎంపీపీలు గొంపా చినబాబు, దొండా లలితా నారాయణమూర్తి, సర్పంచ్ పెదిరెడ్ల మాణిక్యం, ఏపీఎం బాలరాజు, వెలుగు సిబ్బంది కొండలరావు, గణపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment