పట్టుదలతో పైకి ఎదిగిన పల్లెటూరి యువకుడు
నర్సీపట్నం: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడా యువకుడు. ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని సంతృప్తి చెందలేదు. అందులోనే ఉన్నత స్థానానికి వెళ్లాలని నిరంతరం కష్టపడ్డాడు. పోటీ పరీక్షలు రాసి అనుకున్నది సాధించాడు. యువతరానికి ఆదర్శంగా నిలిచాడు. రావికమతం మండలం జెడ్.కొత్తపట్నం పంచాయతీ శివారు గంపవానిపాలేనికి చెందిన విజనగిరి గోవింద్ విజయప్రస్థానమిది.
గోవింద్ పుట్టింది పల్లెటూరు అయినప్పటికీ తల్లిదండ్రులు రాజారావు, సత్యవతి ప్రోత్సాహంతో చదువుపై దృష్టి సారించారు. ప్రాథమిక విద్య గంపవానిపాలెం ప్రభుత్వ పాఠశాల, కొత్తకోట జూనియర్ కాలేజీలో ఇంటర్, బీకాం డిగ్రీ నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. 2011లో కాకినాడలో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్ ర్యాలీలో క్లర్క్‌గా సెలెక్ట్ అయ్యారు. భోపాల్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ సెంటర్‌లో ఏడాదిన్నర శిక్షణ పూర్తి చేసుకుని, అహ్మదాబాద్‌లో విధుల్లో చేరారు.
13 ఏళ్లుగా ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. 2023 మార్చిలో ఎస్‌ఎస్‌బీ (సర్వీసెస్ సెలక్షన్ బోర్డు) బెంగళూరులో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో 152 మంది పోటీ పడగా 8 మంది ఎంపికయ్యారు. ఈ ఎనిమిది మందిలో గోవింద్ ఒకరు. ఆఫీసర్స్ విభాగం క్లాస్‌వన్‌లో స్పెషల్ కమిషన్ ఆఫీసర్ (లెఫ్టినెంట్)గా ఎంపికయ్యారు. బిహార్ రాష్ట్రం గయాలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ అనంతరం తల్లిదండ్రులు, భార్య భవాని, పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇండియన్ ఆర్మీలో స్పెషల్ కమిషన్ ఆఫీసర్‌గా రాజస్థాన్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment