
షేర్ ఆటోగా నమ్మించి మహిళకు టోకరా
పట్టపగలు బంగారం గొలుసు చోరీ
నర్సీపట్నం: పట్టపగలు మహిళ మెడలో బంగారం తాడును దుండగులు తెంచుకువెళ్లిన ఘటన నర్సీపట్నంలో వెలుగు చూసింది. బాధితరాలు కథనంగా ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం, చీడిగుమ్మల గ్రామానికి చెందిన లోకారపు లక్ష్మమ్మ ఈ నెల 3న ఇంట్లోకి నిత్యావసర సరకుల కొనుగోలు చేసేందుకు నర్సీపట్నం వెళ్లింది. నిత్యావసర సరకులు కొనుగోలు చేసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఐదు రోడ్ల కూడలిలోని ఐస్ పార్లర్ వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. చీడిగుమ్మల తీసుకువెళ్తున్నట్టు నటించి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి వెనక్కి తిప్పేశారు. నర్సీపట్నం టౌన్‌లో నుంచి కొత్తవీధి, పెదబొడ్డేపల్లి రోడ్డులో ఉన్న శ్మశానవాటిక వద్ద మహిళ మెడలోని రూ.2 లక్షలు విలువ చేసే రెండు తులాల బంగారు తాడు తీసేసుకొని, ఆమెతో పాటు ఆటోలో నిత్యావసర సరకులు దించేసి వెళ్లిపోయారు. ఇదంతా ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మహిళ లబోదిబోమంటూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. శుక్రవారం కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని టౌన్ సీఐ గోవిందరావును కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.