అనంతపురం శ్రీకంఠంసర్కిల్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్ పడి తల్లీబిడ్డ గాయపడ్డారు. విషయాన్ని గమనించిన అభిమానులు ఆదుకుంటామని చెప్పి చేతులెత్తేశారు. వివరాలు.. అనంతపురంలోని హౌసింగ్‌బోర్డు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న వృద్ధ దంపతులు రామచంద్ర, వెంకటలక్ష్మికి ఇద్దరు కుమారులు రాఘవేంద్ర (బుద్ధి మాంధ్యం), రాంప్రసాద్, ఇద్దరు కుమార్తెలు జయలక్ష్మి (బుద్ధి మాంధ్యం) చంద్రకళ ఉన్నారు.
చిన్నపాటి పనులతో కుటుంబానికి చేదోడుగా చంద్రకళ నిలిచింది. ఇంట్లో మంచానపడిన ముగ్గురికి తల్లి సేవలందిస్తుండగా రాంప్రసాద్ పగలంతా తిరిగి అగరుబత్తీలు అమ్మినా రోజుకు వందకు మించి ఆదాయం ఉండడం లేదు. అతనికి కూడా కాళ్లు సరిగా లేవు. దీంతో కుటుంబం మొత్తం చంద్రకళ సంపాదనపైనే ఆధారపడింది.
విషాదం నింపిన బాలయ్య పుట్టిన రోజు..
ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని అనంతపురంలోని టవర్ క్లాక్ సమీపంలో బాలయ్య అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం అటుగా వెళుతున్న వెంకటలక్ష్మి, చంద్రకళపై కటౌట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో చంద్రకళ నోట్లోకి కటౌట్‌కు ఏర్పాటు చేసిన వెదురు కర్ర దూసుకుపోయింది. తల్లికీ తీవ్ర గాయమైంది. అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చంద్రకళకు శస్త్రచికిత్స చేసి వెదురు కర్రను వైద్యులు తొలగించారు. ఆ సమయంలో ఆమె పళ్లను పూర్తిగా తొలగించి కుట్లు వేశారు. దాదాపు నెలరోజుల పాటు కుట్లు తీయడానికి వీల్లేదని వైద్యులు తెలిపారు.
న్యాయం చేయండి
జరిగిన అన్యాయానికి మేము ఆర్థిక సాయం కోరడం లేదు. న్యాయం చేయాలని కోరాం. ఆపరేషన్ చేయించుకున్న చెల్లెలు ఎనిమిది రోజులుగా నోరు మెదపలేకపోతోంది. మరో 25 రోజులు ఇదే పరిస్థితి అని డాక్టర్లు చెప్పారు. అన్నం.. నీరు అన్నీ పైప్ ద్వారానే అందజేస్తున్నాం. అమ్మ గొంతుకూ తీవ్రగాయమై మంచం పట్టింది. చెల్లి, అన్న బుద్ధిమాంధ్యులు, చాలా రోజులుగా అనారోగ్యంతో తండ్రి కూడా మంచాన పడ్డాడు. ఇంత మందిని చూసుకోవడం ప్రస్తుతం నావల్ల కావడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. – రాంప్రసాద్,
Comments
Please login to add a commentAdd a comment