ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?...............
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రభీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?
... అంటూ ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకిస్తూ సుయోధనుడి పాత్రధారి కుమ్మెత సోమిరెడ్డి గంభీరంగా డైలాగులు పలికినప్పుడు రంగస్థల ప్రాంగణం చప్పట్లతో ఓ ఐదు నిమిషాల పాటు మార్మోగింది. ఆ తర్వాత వన్స్‌మోర్ నినాదాలతో ప్రేక్షకులు రెచ్చిపోయారు. పౌరాణిక నాటకాలంటే ముందుగా అనంత పేరు గుర్తొచ్చేలా నవరసాలను పలికిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న వారిలో c ముందు వరుసలో ఉంటారు.
అనంతపురం కల్చరల్: అచ్చు సీనియర్ ఎన్టీఆర్‌ను తలపించేలా ఉండే కుమ్మెత సోమిరెడ్డి.... రారాజు పాత్ర వేశాడంటే అభిమానులు మంత్ర ముగ్దులవ్వాల్సిందే. డైలాగులు చెప్పే తీరు, మధురంగా ఆలపించే పద్యాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిచోటా కరతాళధ్వనులు, వన్స్‌మోర్లతో ఆడిటోరియాలను మార్మోగించే కళాకారుల్లో సోమిరెడ్డిది అగ్రస్థానం. ఆయనలోని కళాకారుడిని గుర్తించిన అనేక సంస్థలు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. కర్ణాటకకు రాఘవ కళాసంస్థ వారు ప్రతిష్టాత్మక నటులకిచ్చే ‘బళ్లారి రాఘవ పురస్కారం’తో పాటు మరెన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు.
పాత్రేదైనా ఒదిగిపోవడమే
కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారుడు కుమ్మెత చిన్నారెడ్డి కుమారుడు సోమిరెడ్డి... చిరుప్రాయం నుంచే రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. తనకు దక్కిన ప్రతి పాత్రకూ న్యాయం చేస్తూ వస్తున్నారు. వారణాసిలో సత్యహరిశ్చంద్రునిగా, మహాభారతంలో భీముడిగా, రామాయణ ఘట్టాల్లో రాముడిగా, భాగవతంలో కృష్ణుడిగా, బాలనాగమ్మలో బాలవర్ధిగా అసమాన నటనను ప్రదర్శించే సోమిరెడ్డి ముఖ్యంగా రారాజు పాత్రలో ఒలికించే రాజసానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటారు. గత 40 ఏళ్లలో ఆయన ఎన్ని పాత్రలు పోషించినా.. సుయోధనుడి పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అనంతలోనే కాకుండా తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర చోట్ల ఆయన నటించిన మయసభ సీను చూసిన ప్రేక్షకులకు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.
ఏమిచ్చినా తీర్చుకోలేం
పౌరాణిక నాటకానికి తగినట్లుగా మంచి వర్చస్సు, అభినయం, ఆంగికం అన్నీ కుదరాలంటే సద్గురువుల ఆశీస్సులుండాలి. ఆంధ్రదేశంలో విఖ్యాతి పొందిన గుమ్మడి గోపాలకృష్ణ, కోటేశ్వరరావు లాంటి వారి సరసన నటించే అవకాశం నాకు దక్కడం అదృష్టమే. దుర్యోధనుడు, భీముడి పాత్రలు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అనంత రంగస్థలానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే గత నాలుగేళ్లగా నా సొంత ఖర్చుతో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment