బాలింతలకు ఇన్‌ఫెక్షన్‌ | Sakshi
Sakshi News home page

బాలింతలకు ఇన్‌ఫెక్షన్‌

Published Sat, May 25 2024 4:30 PM

బాలింతలకు ఇన్‌ఫెక్షన్‌

కుట్లు వేసిన ప్రాంతంలో చీము

ప్రతి పది మందిలో ముగ్గురిది అదే పరిస్థితి

ప్రస్తుతం జీజీహెచ్‌లో 15 మందికిపైగా బాధితులు

అనంతపురం మెడికల్‌: ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు పెద్ద దిక్కుగా సర్వజనాస్పత్రి (జీజీహెచ్‌)లో వైద్య సేవలు నానాటికీ నరకప్రాయమవుతున్నాయి. రోజు వారీ ఓపీ 2,500, ఐపీ 1,300 వరకు ఉంటోంది. నిర్వహణ లోపం కారణంగా సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉత్పన్నమవుతున్నాయి. మొన్నటి మొన్న విద్యుత్‌ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని గంటల తరబడి వైద్య సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా గైనిక్‌ వార్డులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పలువురు బాలింతలు పడుతున్న విషయం వెలుగుచూసింది. ఫలితంగా ప్రసవం జరిగిన తర్వాత రోజుల తరబడి ఆస్పత్రిలో అడ్మిషన్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి సైతం బాలింతలకు కుట్లు వేయాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి ఉన్నతాధికారులు, గైనిక్‌ విభాగం వైద్యుల పర్యవేక్షణ.. సురక్షిత ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని గైనిక్‌ విభాగంలో 15 మందికిపైగా బాలింతలు ఇన్‌ఫెక్షన్‌ సోకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో రోగులకందే సేవల్లో వైద్యుల బాధ్యతారాహిత్యంపై ఇప్పటికై నా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పందించాలని పలువురు కోరుతున్నారు.

ప్రతి పది మందిలో ముగ్గురు

సర్వజనాస్పత్రిలోని ప్రసూతి విభాగంలో రోజూ 25 నుంచి 30 ప్రసవాలు జరుగుతాయి. ఇందులో 5 నుంచి 10 సిజేరియన్‌లు ఉంటున్నాయి. గత నెలన్నర రోజులుగా సిజేరియన్‌ కేసుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో బాలింతలకు కుట్లు వేసిన ప్రాంతంలో చీము వస్తోంది. సురక్షిత ప్రమాణాలు పాటించకపోవడమే ఇన్‌ఫెక్షన్‌కు కారణంగా వైద్యులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఫ్యుమిగేషన్‌ చేయిస్తున్నాం

బాలింతలకు సిజేరియన్‌ చేసిన ఐదు రోజుల్లోపు పుండు(ఊండ్‌) మానాలి. అయితే ఇన్‌ఫెక్షన్‌ కారణంగా గాయం నయం కావడం లేదన్న మాట వాస్తవమే. దీనిపై మైక్రో బయాలజీ విభాగం సూచన మేరకు గైనిక్‌ విభాగంలోని ఓ వార్డును ప్యుమిగేషన్‌ చేయించాం. మరో వార్డును ఫ్యుమిగేషన్‌ చేయించి బాలింతలకు మెరుగైన సేవలందిస్తాం.

– డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వర రావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement