రాష్ట్రంలో ఉరిశిక్ష అమలు చేసి అర్ధ శతాబ్దం సమీపిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఔను నిజమే. వివిధ పరిస్థితుల నేపథ్యంలో శిక్షల అమలులో ఆలస్యం అనివార్యమవుతోంది. దేశంలో కేంద్ర కారాగారాలన్నింటిలోనూ ఈ శిక్ష పడిన ముద్దాయిలు వివిధ అప్పీళ్లతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనూ ఇదే పరిస్థితి.
రాష్ట్రంలో ఉరి తీసేందుకు వీలున్న ఏకైక సెంట్రల్ జైలు ఇక్కడే ఉంది. ఎక్కడ ఉరి శిక్ష పడినా ముద్దాయిని ఇక్కడి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. ఈ జైలులో ఇప్పటివరకూ 48 మందిని ఉరి తీసినట్లు సమాచారం. స్వాతంత్య్రం వచ్చాక 27 మందిని ఉరి తీశారు.
ఆఖరిసారిగా 1976 ఫిబ్రవరి 22న అనంతపురానికి చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. అప్పటి నుంచి అంటే ఈ 47 ఏళ్ల కాలంలో ఉరి శిక్ష అమలు కాలేదు. 1997 మార్చిలో ఇద్దరిని ఉరి తీయాల్సి వచ్చినా అనూహ్య పరిణామాల మధ్య సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్ష అమలు కాలేదు. – డెస్క్, రాజమహేంద్రవరం
1602లో డచ్‌వారి హయాంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ హయాంలో 1864లో దీనిని జైలుగా మార్చారు. 1870లో దీనికి పూర్తి జైలు రూపం వచ్చింది. 1990లో దీనిని ఆధునీకరించారు. పాత కట్టడం ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపు ఉరి (హ్యాంగ్) సెల్ ఉండేది. తర్వాత కొత్తగా నిర్మించిన జైలు పరిపాలనా భవనం కింది భాగంలోకి దీనిని మార్చారు. దేశంలో భూగర్భ హ్యాంగ్ సెల్ ఇదొక్కటేనని చెబుతారు.
తలారీ కోసం తలనొప్పులు
ఉరిశిక్షను అమలు చేసే తలారీ (హ్యాంగ్‌మన్) పోస్టు అంటూ ప్రత్యేకంగా ఉండదు. శిక్ష అమలు చేసినప్పుడల్లా తలారీ ఎంపిక తలనొప్పిగానే పరిణమిస్తుంది. ఈ శిక్ష అమలు చేసేవారికి మనో నిబ్బరం ఉంటాలి. అనారోగ్యం లేదా గుండె సంబంధ సమస్యలు ఉండకూడదు.
సాధారణంగా ఉరిశిక్షను అమలు చేసే వ్యక్తి కుటుంబం నుంచి వారసత్వంగా ఎవరో ఒకరు ముందుకు వస్తుంటారు. 1997లో ఇక్కడి జైలులో ఉరి శిక్ష అమలు కావాల్సి ఉండగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కృష్ణా జిల్లా తిరువూరు సబ్‌జైలులో పని చేసిన ధర్మరాజు సంసిద్ధత తెలిపారు. అధికారులు ఆయనను రాజమహేంద్రవరానికి డిప్యుటేషనుపై తీసుకువచ్చారు. తీరా వచ్చాక ఆఖరి సమయంలో ఉరి అమలు కాలేదు.
అచ్చం సినిమా తరహాలోనే..
1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో చలపతిరావు, విజయ వర్ధన్‌లకు 1995లో గుంటూరు సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. 1997 మార్చి 14న ముద్దాయిల క్షమాభిక్ష పిటిషన్‌ను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ తిరస్కరించారు. దీంతో అదే నెల 29న వీరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. శిక్ష అమలుకు ముందు రోజు మార్చి 28న రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మను జ్ఞాన్‌పీట్ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవితో పాటు మరికొందరు ప్రముఖులు కలిశారు.
క్షమాభిక్ష వినతిని మరోసారి పరిశీలించాలని అభ్యర్థించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించారు. దీంతో వారు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడేవరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అభ్యర్థించారు. ఆ రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసు విచారించి రాష్ట్రపతి నిర్ణయం వెలువడేంత వరకూ శిక్ష అమలు చేయవద్దని ఆదేశించింది.
అర్ధరాత్రి దాటాక నిర్ణయం రావడంతో సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్షను నిలిపివేశారు. తర్వాత రాష్ట్రపతి నారాయణన్ వీరి ఉరి శిక్షను జీవితకాల కారాగార శిక్షగా మార్చాలని నిర్ణయించారు. ముద్దాయిల్లో విజయ వర్ధన్ ఇప్పటికీ 30 ఏళ్లుగా రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. చలపతిరావు మరో జైలులో ఉన్నారు.
రోజూ ప్రాణ సంకటమే..
ఉరి శిక్ష అమలు చేస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. కానీ శిక్ష అమలవుతుందో లేదో తెలియక ఏళ్ల తరబడి ఆశనిరాశల మధ్య నలిగిపోతున్నారు ఉరి శిక్ష ఖైదీలు. 2021లో ఉరి శిక్ష పడిన మున్నా గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇక్కడి కేంద్ర కారాగారంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 18 మంది ఉరి శిక్ష ఖైదీలున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. పై కోర్టులకు అప్పీలు వంటి వివిధ దశల్లో వీరి కేసులు కొనసాగుతున్నాయి. 1997లో తన ఉరి శిక్ష యావజ్జీవ ఖైదుగా మారిన నేపథ్యంలో 30 ఏళ్లకు పైబడి కారాగారంలో ఉంటున్నానని చిలకలూరిపేట బస్సు దహనం కేసు ఖైదీ విజయ వర్ధన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రత్యామ్నాయ విధానాలపై కమిటీ
ఉరి శిక్షకు ఇకపై ఉరి పడుతుందా.. మరణ శిక్ష అమలులో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. సున్నితమైన ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. మరణ శిక్ష కింద ఉరి కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలని 2017లో న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలాల ధర్మాసనం ఈ ఏడాది మార్చి చివరిలో విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి దీనిపై సమాధానం చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు.
ఆ రాత్రి ఎప్పటికీ గుర్తే..
1975లో జైళ్ల సర్వీసులో చేరాను. రాజమండ్రిలో ఇద్దరిని ఉరి తీయాలని తెలిసింది. తీస్తానని ముందుకు వచ్చాను. తిరువూరు నుంచి డిప్యుటేషనుపై రాజమండ్రికి బదిలీ చేశారు. తెల్లవారితే ఉరి అనగా ఆ రాత్రి జైలులోనే ఉన్నాను. నిద్ర పట్టలేదు. మనసంతా ఆలోచనలే. నా చేతుల మీదుగా ఇద్దరు ప్రాణాలు పోతాయనే ఆలోచన ఇబ్బంది పెట్టేది. కర్తవ్యం కదా అని సమాధానం చెప్పుకునేవాడిని.
ఒంటిగంటన్నర తర్వాత కలత నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో సహచరులు వచ్చి లేపి శిక్ష అమలు కావడం లేదన్నారు. ఆ సమయంలో ముద్దాయిల కంటే ఎక్కువగా సంతోష పడ్డాను. 2007లో రిటైరయ్యాను. ఇప్పటికీ రామమండ్రి జైలులో ఉరి రాత్రి గుర్తుకొస్తూనే ఉంటుంది. – ధర్మరాజు, కాపవరం, కోరుకొండ మండలం
ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు
ప్రస్తుతం కేంద్ర కారాగారంలో మరణ శిక్ష పడిన ఖైదీలు 18 మంది వరకూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ శిక్ష పడినా అమలుకు ఇక్కడికే తీసుకువస్తారు. 47 ఏళ్లుగా శిక్ష అమలు చేయనప్పటికీ హ్యాంగ్ సెల్‌లో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపడుతుంటాం. ఉరికంబం గదిలో ఐరన్ లివర్, కింద నిలబడే ఐరన్ పలకలను జాగ్రత్తగా ఉండేలా చూస్తాం. ఆదేశాలొస్తే అమలుకు సిద్ధంగా ఉంటాం. – రాహుల్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం
జాప్యం అనివార్యం
శిక్ష పడిన తర్వాత ఖైదీలకు వివిధ పై కోర్టుల్లో అప్పీలుకు అవకాశం ఉంటుంది. తర్వాత హోం శాఖ ద్వారా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వీలుంటుంది. ఈ దశలు దాటడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి జీవితానికి సంబంధించిన అంశాలు పైకోర్టులు పరిశీలిస్తాయి. ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మరీ క్రూరం, అత్యంత అమానవీయ సంచలన కేసుల్లో మినహా మిగిలిన కేసులన్నింటికీ ప్రొసీజర్ వల్ల జాప్యం అనివార్యం. – ఎం.విశ్వేశ్వరరావు,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment