కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకుంటున్న మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరిని కోరారు. ఏపీలోని పలు పట్టణాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు చక్కటి అవకాశాలున్నాయని, రెండో విడత ప్రాజెక్టులో వీలైనన్ని స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో మూడు రోజుల పాటు జరిగే స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ అర్బనైజేషన్ జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి సోమవారం కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు.
తిరుపతికి పలు ర్యాంకులు
తిరుపతిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలు, అనుసరిస్తున్న విధానాలకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో 2020 సంవత్సరానికి గాను అవార్డులు వరించాయి. వివిధ అభివృద్ధి అంశాల ప్రాతిపదికగా నిర్వహించిన పోటీలో శానిటేషన్, సోషల్ యాస్పెక్టస్ విభాగంలో మొదటి ర్యాంకు, ఎకానమీ విభాగంలో రెండో ర్యాంకు, అర్బన్ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో మూడో ర్యాంకుతో పాటు రౌండ్ వైజ్ సిటీస్ పోటీలో రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ నుంచి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment