గత ప్రభుత్వ హయాంలో రూ.2 వేల కోట్ల విలువైన విశాఖ ఐరన్ కొనుగోలుకు ప్రతిపాదనలు
ఆ ఐరన్‌ను పేదల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాలని నిర్ణయం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలు
విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ఇతోధిక సహకారం అందిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రూ.2 వేల కోట్ల విలువైన ఐరన్ కొనుగోలుకు చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తోంది. కొనుగోలు చేసిన ఐరన్‌ను పేదల ఇళ్ల నిర్మాణాలకు వినియోగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం మేరకు ఆ నిధులు సమకూరితే.. స్టీల్ ప్లాంట్‌లో మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ను ప్రారంభించి నిరంతరాయంగా ఉక్కు ఉత్పిత్తి చేసే అవకాశం కలుగుతుందని కార్మిక, ఉద్యోగ సంఘాలు భావించాయి.
గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అమలు చేయాలని కోరుతూ విశాఖ ప్రజాప్రతినిధులకు సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ విజ్ఞప్తులను చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఇక్కడి ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు.
గత ప్రభుత్వంలో కీలక నిర్ణయం
ఉక్కు పరిశ్రమ విస్తరణ కోసం చేసిన అప్పుల కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన స్టీల్‌ప్లాంట్‌కు రూ.12,500 కోట్ల మూలధనం అవసరముంది. అంత స్థాయిలో కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఈ క్రమంలో ప్లాంట్ నిర్వహణ మరింత భారంగా మారింది. దీనిపై కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి పరిస్థితిని వివరించారు.
ప్రభుత్వం పేదల కోసం నిర్మించే ఇళ్లకు విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి చేసే ఐరన్ వినియోగించాలని, దీనికోసం ముందుగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. వెంటనే అప్పటి ఎంపీ ఎంవీవీ ఈ అంశాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన అప్పటి సీఎం జగన్ పేదల కోసం పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో వాటికి విశాఖ స్టీల్‌ను వినియోగించాలని నిర్ణయించారు.
దీనిపై పరిశ్రమల శాఖ అధికారులతో కమిటీని నియమించారు. సదరు కమిటీ 2023 ఆగస్టులో స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి ఉన్నతాధికారులతో చర్చించింది. అనంతరం ప్రతినెలా రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్లు ఇచ్చేలా అధికారుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 6 నెలల తరువాత నుంచి ఐరన్ తీసుకునే విధంగా ఆ నివేదిక ప్రభుత్వానికి సమరి్పంచింది. ఇంతలో ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
గత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తే స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అంశంపై ఇప్పటికే ఉక్కు పరిరక్షణ కమిటీ, కారి్మక, ఉద్యోగ సంఘాల నాయకులు గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమే‹Ùబాబుకు వినతిపత్రాలు అందించారు.
పేదల ఇళ్లతోపాటు అమరావతి, పోలవరం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు విశాఖ ఉక్కును వినియోగించాలని, అందుకు అడ్వాన్స్‌గా రూ.2 వేల కోట్లు ప్లాంట్‌కు ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. కార్మిక సంఘాల నేతలు నెల రోజులుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకపోయింది.
కాగా.. స్టీల్‌ప్లాంట్‌లో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేసినా, పరిశ్రమల ఆస్తులను వేలం ద్వారా విక్రయించడానికి సిద్ధపడినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ.. మోదీపై కనీసం ఒత్తిడి తీసుకురాకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. కేంద్రంతో లాలూచీ పడి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment