సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో నాటి సీఎం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయని.. వాటివల్లే పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని.. వాటిని ప్రచురించే ధైర్యం మీకుందా? అంటూ ‘ఈనాడు’ రామోజీరావు సహా ఎల్లో మీడియాకు ఆయన సవాల్ విసిరారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. వరదను మళ్లించేలా ప్రాజెక్టు ప్రోటోకాల్ ప్రకారం స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తిచేసి, అలాగే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి.. వరదను మళ్లించాకే కాఫర్ డ్యామ్‌ల మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ వేయాలని గుర్తుచేశారు. కానీ.. వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తిచేయకుండానే డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు నిర్మించారని.. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌ల పనులు ప్రారంభించి.. మధ్యలోనే వదిలేశారని గుర్తుచేశారు.
ఫలితంగా.. కాఫర్ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో వరద ప్రవహించడంవల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) తేల్చిందని.. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ, పీపీఏ, డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ అధికారులు చర్చిస్తున్నారన్నారు. చంద్రబాబు ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. ఈపాటికి సీఎం వైఎస్ జగన్ ఎప్పుడో ప్రాజెక్టును పూర్తిచేసేవారన్న వాస్తవాన్ని టీడీపీ నేతలు గ్రహించాలని అంబటి రాంబాబు చురకలంటించారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..
జాతికి అంకితం చేసేది సీఎం జగనే..
రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పనులకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4,730.71 కోట్లను ఖర్చుచేశారు. దీనిని జాతికి అంకితం చేసేది ఆయన తనయుడు సీఎం వైఎస్ జగనే. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వేను పూర్తిచేసి.. 48 గేట్లు బిగించాం. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసి.. 2021, జూన్ 11న 6.1 కిమీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి చరిత్ర సృష్టించాం. దిగువ కాఫర్ డ్యామ్‌నూ పూర్తిచేశాం. ప్రొటోకాల్ పాటించకుండా చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదంవల్లే రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇప్పుడది నిర్మించాలంటే ఎన్ని వందల కోట్లు అవుతాయో? ఇవన్నీ రాసే ధైర్యం రామోజీకి ఉందా?
పయ్యావులవి పిచ్చి ఆరోపణలు
రాయలసీమ ఎత్తిపోతలలో పనులు చేయకుండానే కాంట్రాక్టర్‌కు రూ.900 కోట్లు దోచిపెట్టారని.. ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న రుణం కన్సాలిడేట్ ఫండ్‌లో జమచేయకుండా నేరుగా కాంట్రాక్టర్‌కే చెల్లించారని.. ఇదో పెద్ద కుంభకోణమని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన పిచ్చి ఆరోపణలకు, ఈనాడు రాతలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని ముందు అనుకున్నా.
కానీ, పయ్యావుల మళ్లీ స్పందిస్తూ.. నేను స్పందించలేదు కాబట్టి, నేరం అంగీకరించినట్లే అని ఆరోపిస్తే.. దానిని ఈనాడులో అచ్చేశారు. నిజానికి.. ఆర్‌ఈసీ నుంచి రాయలసీమ ఎత్తిపోతలకు రూ.900 కోట్ల రుణం తీసుకున్నది వాస్తవం. కాంట్రాక్టర్‌కు ఆర్‌ఈసీ నేరుగా చెల్లించిన మొత్తం రూ.900 కోట్లు కాదు.. రూ.739.5 కోట్లు మాత్రమే. జరిగిన పనులన్నింటినీ పూర్తిస్థాయిలో తనిఖీచేశాకే సీఎంఎఫ్‌ఎస్‌లో బిల్లులు లోడ్ చేశారు. అనేక రాష్ట్రాల్లో ఆర్‌ఈసీ ఇలాగే బిల్లులు చెల్లిస్తోంది.
రెండు విడతలు కాదు.. రెండు ప్యాకేజీల యాత్ర..
ఇక.. సీఎం వైఎస్ జగన్‌ను తాను ఏమైనా అంటే వైఎస్సార్‌సీపీ నేతలకు కోపం వస్తుందని పవన్ అన్నారు. అలాగే, ఆయన పెళ్లిళ్ల గురించి మేం మాట్లాడినా పవన్‌కు కోపం వస్తుంది అట.. అందుకే ఇక నుంచి పవన్ పెళ్లిళ్ల గురించి మేం ఎత్తం. అందుకు బదులుగా, ఒక్కోసారి ఒక్కో పెళ్లి చేసుకున్న ‘ఏకపత్నివ్రతుడు’ పవన్‌కళ్యాణ్ అని మాత్రమే అంటాం. ఇక.. శుక్రవారం తణుకు సభలో పవన్ కొద్దిసేపు శాంతంగా మాట్లాడి.. క్షణాల్లోనే ఆవేశంతో ఊగిపోయాడు. మలి్టపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపీడీ) అనేది ఎలా ఉంటుందో నిన్న పవన్ చూపాడు.. పవన్ సమస్య మానసిక వైద్యులకు ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది.
373 సార్లు ఏకవచనంతో..
సీఎం జగన్‌ను ఇకపై ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ శపథం చేసినప్పటి నుంచి.. ముఖ్యమంత్రిని 373 సార్లు అలా సంబోధించాడు. పవన్.. అలా వెయ్యిసార్లు జగన్ నామస్మరణ చేస్తే నీ పాపాలన్నీ పరిహారమవుతాయి. అలాగే హిందూ ధర్మం ప్రకా రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు? వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాకు ఎందుకంత కడుపుమంట? వలంటీర్లపై పవన్, చంద్రబాబు విషం చిమ్మడం హేయం.
♦ చంద్రబాబు చేసిన తప్పిదంవల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటీ (హైదరాబాద్), సీడబ్ల్యూసీ (కేంద్రం జలసంఘం), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) తేల్చిన సంగతి మర్చిపోయారా లేక తెలిసీ తెలీనట్లు నటిస్తున్నారా రామోజీ?
♦ అసలు.. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ దక్కించుకున్న చంద్రబాబు.. కాంట్రాక్టు పనుల్లో రూ.3వేల కోట్ల విలువైన పనులను మీ కుమారుడు వియ్యంకుడికి నామినేషన్‌పై కట్టబెట్టిన మాట వాస్తవం కాదా!?
Comments
Please login to add a commentAdd a comment