సాక్షి, అమరావతి: పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని బిల్లుల రూపంలో ‘దోచిపెట్టడం’ .. దాన్ని ‘పంచుకోవడం’.. ఆ తర్వాత ‘తినేయడం’.. ఇదీ టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబుతో ‘ఈనాడు’ రామోజీరావు సాగించిన ‘డీపీటీ’ దందా. పోలవరం ప్రాజెక్టు మట్టి తవ్వకం పనుల్లో 1.65 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి... రూ.150.93 కోట్లను కాంట్రాక్టర్ అయిన కొడుకు వియ్యంకుడి సంస్థకు చెల్లించి.. చంద్రబాబుతో కలిసి రామోజీరావు పంచుకుతిన్నారు.
ఈ దోపిడీని 2018, మార్చి 24న ‘మట్టిలో రూ.150.93 కోట్లు మింగేశారు’ శీర్షికన ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. దీనిపై స్పందించిన పే అండ్ అకౌంట్స్ విభాగం అధికారులు ఎం–బుక్‌ల తనిఖీకి ఉపక్రమించారు. భయంతో హడావుడిగా కొంతమేర పనులు చేశారు. అయినా సరే.. తనిఖీ పూర్తయ్యే నాటికి చేయని మట్టి పనులకు రూ.112.47 కోట్లు చెల్లించారని నిర్ధారించారు. దోచిపెట్టిన రూ.112.47 కోట్లను రికవరీ చేయాల్సిందేనని 2018, జూలై 10న పోలవరం ప్రాజెక్టు ఉన్నతాధికారులకు అప్పటి పశ్చిమగోదావరి జిల్లా పీఏవో కె.సోమయ్య తాఖీదులు జారీచేశారు.
ఈ నేపథ్యంలో.. తాము దోపిడీ చేసినట్లుగానే ఇతరులూ చేస్తారని భ్రమపడుతున్న రామోజీరావు.. ‘పనులు కాకుండానే పైసలిచ్చేశారు’ శీర్షికతో మంగళవారం మరో తప్పుడు కథనాన్ని అచ్చేసి రాష్ట్ర ప్రభుత్వంపై యథేచ్ఛగా విషం చిమ్మారు. నిజానికి.. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అత్యంత పారదర్శకంగా.. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని.. అప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా భవిష్యత్ ఉండదనే భయంతో ఆ పథకాన్ని అడ్డుకునేందుకు తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తితో ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యున్)లో దుష్టచతుష్టయం కేసులు వేయించింది. ఇందులో ప్రధాన భూమిక రామోజీదే. ఓ వైపు ఎన్జీటీలో కేసులు వేయించి రాయలసీమ ఎత్తిపోతలకు సైంధవుల్లా అడ్డుపడుతూ.. మరోవైపు ఆ ఎత్తిపోతలపై సన్నాయినొక్కులు నొక్కుతూ.. రామోజీ అడుగడుగునా వాస్తవాలను ఆ కథనంలో వక్రీకరించారు. అందులోని నిజానిజాలు ఏమిటంటే..
ఈనాడు: రాయలసీమ ఎత్తిపోతల పనులకు ఆర్‌ఈసీ నుంచి 10.5 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించి మరీ కార్పొరేషన్ పేరుతో అప్పు తెచ్చి.. ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేకుండా నేరుగా కాంట్రాక్టు సంస్థ మేఘా జాయింట్ వెంచర్‌కు రూ.739 కోట్లు చెల్లించేశారు.
వాస్తవం: పట్టిసీమ, పురుషోత్తపట్నం, కొండవీటివాగు ఎత్తిపోతల, గోదావరి–పెన్నా అనుసంధానం వంటి ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల వద్ద.. అమరావతి డెవలప్‌మెంట్ బాండ్ల పేరుతో పది శాతం కంటే అధిక వడ్డీకి టీడీపీ ప్రభుత్వం రూ.వేల కోట్లను అప్పుగా తెచ్చింది. ఇందులో కొంత మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని ఎన్నికలకు ముందు చంద్రబాబు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు.
అప్పట్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించావా రామోజీ? చంద్రబాబు సర్కార్ నిధులను దారిమళ్లించడంవల్లే.. ఇచ్చే రుణాన్ని నేరుగా కాంట్రాక్టు సంస్థకే చెల్లిస్తామని ఆర్‌ఈసీ, పీఎఫ్సీ సంస్థలు నిబంధనలు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టుపై రోతరాతలు రాయడం తగునా రాజగురవిందా? చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక నీతి.. జగన్ ఉంటే మరో నీతి అంటే ఎలా?
ఈనాడు: ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన సంబంధాలు ఉన్నాయని ప్రకటించే సీఎం జగన్.. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను సాధించలేకపోతున్నారు.
వాస్తవం: రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే చంద్రబాబుకు రాజకీయంగా భవిష్యత్ ఉండదనే భయంతో ఆ పథకంపై ఎన్జీటీలో కేసులు వేయించి అడ్డుకున్న దుష్టచతుష్టయంలో కీలక పాత్రధారివి నువ్వే కదా రామోజీ? పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో రాష్ట్ర జలవనరుల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. దీనికి పర్యావరణ అనుమతులు ఇప్పించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి సీఎం జగన్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానాల్లో ఉన్న కేసులలో ప్రధాని మోదీ ఎలా జోక్యం చేసుకుంటారనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా రాజగురవిందా?
ఈనాడు: పర్యావరణ సమస్యల కారణంగా రెండేళ్ల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు. ఇప్పట్లో పనులు చేపట్టే అవకాశాలు కన్పించడంలేదు. అయినా కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేశారు.
వాస్తవం: శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే కల్వకుర్తి, జలవిద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్ ఇప్పటికే నీటిని తరలిస్తోంది. అలాగే, 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టింది. కానీ, శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు ఏడువేల క్యూసెక్కులు మాత్రమే వాడుకోగలం. ప్రాజెక్టులో 875 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే.. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తరలించడానికి సాధ్యమవుతుంది.
కృష్ణా నదిలో క్రమేణా వరద రోజులు తగ్గుతుండటం.. తెలంగాణ సర్కార్ వచ్చిన నీటిని వచ్చినట్లు తోడేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న తరుణంలో.. ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని మరింత సమర్థవంతంగా వాడుకుని తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీరు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగునీరు, చెన్నైకి తాగునీరు అందించడానికి సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు.
శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఎస్సార్బీసీ కాలువలోకి ఎత్తిపోసేలా ఈ పథకాన్ని చేపట్టారు. రాయలసీమ ప్రాజెక్టులకు గుండెకాయ వంటి రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతుందని.. అప్పుడు చంద్రబాబుకు భవిష్యత్తు అంధకారమవుతుందనే భయంతో.. ఆ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తితో చంద్రబాబు నేతృత్వంలోని దుష్టచతుష్టయం ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్)లో కేసులు వేయించింది.
పర్యావరణ అనుమతులు తెచ్చుకునే వరకూ పనులు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. దాంతో.. పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. కానీ, దీనికి ఓవైపు సైంధవుల్లా అడ్డుపడుతూ మరోవైపు సన్నాయినొక్కులు నొక్కితే ఎలా రాజగురవిందా? ఎలాంటి పర్యావరణ అనుమతి తీసుకోకుండా టీడీపీ సర్కార్ చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో ట్రయల్ రన్ దశలోనే రూ.1,900 కోట్లతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ఆగిపోయింది. ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు రూ.కోట్ల ప్రజాధనాన్ని అపరాధ రుసుగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈనాడు: పనులు చేయకున్నా పైసలు ఇచ్చేశారు. మోటార్లు, పంపులు, ఎలక్ట్రిక్ పరికరాలతో ఎలాంటి పనులు చేయలేదు.
వాస్తవం: రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద చేసిన పనులను వాటి పరిమాణం ఆధారంగా ఎం–బుక్‌లలో ఫీల్డ్ ఇంజినీర్లు రికార్డు చేశారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు వాటిని తనిఖీచేసి.. డిజైన్ ప్రకారం, నాణ్యంగా పనులు చేశారని తేల్చారు. ఈ పనులను ఆర్‌ఈసీ బృందం మరోసారి పరిశీలించాకే బిల్లులు చెల్లించారు.
చెల్లించిన రూ.739.5 కోట్లతో.. సమగ్ర సర్వే, డిజైన్లకు రూ.8.46 కోట్లు, అప్రోచ్ చానల్‌కు రూ.204.07 కోట్లు, పంప్‌హౌస్ నిర్మాణం, తదితర పనులకు రూ.167.27 కోట్లు.. పంపులు, మోటార్ల విడిభాగాల సేకరణకు రూ.293.98 కోట్లు, జీఎస్టీ, ఐటీ వంటి ఇతర చెల్లింపులకు రూ.65.71 కోట్లను ఆర్‌ఈసీ విడుదల చేసింది.
పనులు జరుగుతున్నప్పుడే మెటీరియల్ తెప్పించుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తిచేసి, రైతులకు ప్రయోజనాలు అందించాలనుకోవడం ఏ రకంగా తప్పు రామోజీ? టీడీపీ హయాంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి పథకాలకు పంపులు, మోటార్లు, ఎలక్ట్రిక్ పరికరాల సేకరణకు ముందస్తుగా రూ.వేల కోట్లు చెల్లించలేదా? గోదావరి–పెన్నా అనుసంధానం పథకంలో ఒక్క ఎకరా భూసేకరణ చేయకుండానే దాదాపు రూ.వెయ్యి కోట్లు ఎలక్ట్రిక్ పరికరాలకు టీడీపీ సర్కార్ చెల్లించినప్పుడు.. ప్రశ్నించడానికి నీ నోరు మూగబోయిందా రామోజీ? భూసేకరణను టీడీపీ జఠిలం చేయడంతో.. ఆ ఇబ్బందులను అధిగమించి గోదావరి–పెన్నా అనుసంధానం పనులు చేయడానికి ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి వస్తోంది.
నాడు తాకట్టు.. నేడు పరిరక్షణ..
శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల కంటే దిగువ నుంచి రోజుకు రెండు టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ అక్రమంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపడితే దాన్ని అడ్డుకోవడంలో నాటి సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు. కానీ, జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే రాష్ట్ర ప్రయోజనాలు.. రైతుల హక్కుల పరిరక్షణే పరమావధిగా పనిచేస్తున్నారు.
♦ రాయలసీమ ఎత్తిపోతలతోపాటు శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే వరదను ఒడిసిపట్టి.. రాయలసీమ ప్రాజెక్టులను నింపేందుకు కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు.
♦ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు పెంచేలా పనులు చేపట్టారు.
♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ ప్రవాహ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు.. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచే పనులను రూ.500 కోట్లు వెచ్చించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. తద్వారా సకాలంలో వెలిగోడు రిజర్వాయర్‌ను నింపుతున్నారు.
♦ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్‌తో లీకేజీలకు అడ్డుకట్ట వేసి.. గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని నిల్వచేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట, చిత్రావతిలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వచేస్తూ ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు.
♦ ఇక హంద్రీ–నీవా ద్వారా ఏటా సగటున 40 టీఎంసీలు తరలిస్తూ రాయలసీమ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారు.
♦ మరోవైపు.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను రూ.128 కోట్లతో పూర్తిచేసి, నీటిని తరలించేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment