సాక్షి, తాడేపల్లి: వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండటం చాలా బాధాకరమని, ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఇది ఆవిర్భావం కాలేదని, దీని వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాటం జరిగిందని గర్తు చేశారు. విశాఖ ఉక్కు కేవలం విశాఖకే కాదు యావత్ రాష్ట్రానికే తలమానికమన్నారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ అంశంపై పోరాటం చేయాల్సింది పోయి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అసలు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు తొలి అడుగు చంద్రబాబు హయాంలోనే పడిందన్నారు.
విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్.. ఆ దిశగా ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన నిలదీశారు. బీజేపీతో జతకట్టిన జనసేనానికి కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేనాని ఢిల్లీ పర్యటనకు వెళ్లేది విశాఖ ఉక్కు కోసమా.. లేక తిరుపతి సీటు కోసమా అంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్ర సంస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కులు ఉండవని తెలిసి కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం అమ్మే అవకాశం ఉంటే చంద్రబాబు ఏ రోజో ఆ పని చేసే వాడని విమర్శించారు. అప్పటి వరకు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు చంద్రబాబు అధికారంలోకి రాగానే నష్టాల్లోకి వెళ్ళిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు.
ఈ అంశంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకొని కలిసికట్టుగా విశాఖ ఉక్కును కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరారు. పట్టుమని 10 పంచాయతీలు కూడా గెలవలేని తెలుగుదేశం పార్టీ.. వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని ఢంకా కొట్టడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్సీపీ 90 శాతం పంచాయతీలను గెలుచుకుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ప్రతి ఇంటికి వెళ్ళింది కాబట్టే ఎన్నికలు ఏవైనా, ఎప్పుడు జరిగినా 90 శాతం ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తామని, పెట్టుబడుల ఉపసంహరణను ఆపడానికి ఏమి చేయాలో అన్ని చేస్తామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment