టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం | Answers With Highest Marks Will Be Considered - Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం.. వారికి ఎక్కువ మార్కులొచ్చే ఛాన్స్‌!

Published Thu, Apr 13 2023 5:30 AM | Last Updated on Thu, Apr 13 2023 4:53 PM

Answers with highest marks will be considered - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్‌ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 

19 నుంచి మూల్యాంకనం
ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాలి్సన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో (పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలు మినహా) మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

ఇందుకోసం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్‌లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లో కమిషనర్‌ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు.

మార్గదర్శకాలు ఇవీ
మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలి
 అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్‌ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాలి.
♦ పరీక్ష రాసిన అభ్యర్థి నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడా అన్న అంశాన్ని స్పెషల్‌ అసిస్టెంట్లు గమనించాలి.
♦ ఒకవేళ నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే.. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు వేశారా? లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయాలి.
♦ అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను పరిహరించాలి.
♦ అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లోని కనీసం 20 ఆన్సర్‌ స్క్రిప్టులను ఆయా కేంద్రాల్లోని చీఫ్‌ ఎగ్జామినర్లు పరిశీలించాలి. రోజులో మొత్తంగా 60 వరకు ఆన్సర్‌ స్క్రిప్టులను పరిశీలన చేయాలి.
♦ అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లు మూల్యాంకన పూర్తయిన రెండు సమాధానాల పత్రాలను పరిశీలించాలి.
 అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లో డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌ ప్రతి రోజూ కనిష్టంగా 45 పత్రాలను పరిశీలన చేయాలి.
♦ అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో క్యాంప్‌ ఆఫీసర్‌ ప్రతి రోజూ కనిష్టంగా 20 పత్రాలను పరిశీలించాలి.

పొరపాట్లు జరిగితే చర్యలే
పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం, ఫొటోస్టాట్‌ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో ఏ విధమైన మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వరుసగా స్పెషల్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, చీఫ్‌ ఎగ్జామినర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ సహా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు.
మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలి.
జిల్లాస్థాయి పరిశీలకులు మూల్యాంకన కేంద్రాలను తొలి రెండు రోజులు తప్పనిసరిగా సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement