సాక్షి, వెంకటపాలెం:ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. దీనిలో భాగంగా లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు.
23 ఏళ్లుగా ఇల్లు లేక కష్టాలు పడ్డామన్నా
నాకు పెళ్లయినప్పటి నుంచి 23 ఏళ్లుగా రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నామన్నా. మాతోపాటు అక్కడ 750 కుటుంబాలదీ అదే పరిస్థితి. ఎన్నోసార్లు రైల్వే వారు నోటీసులిచ్చారు. ఇల్లు అద్దెకు తీసుకునే శక్తి లేదు. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి పోవాలో తెలియదు. ఎండకు ఎండాం, వానకు తడిచాం. గజం స్థలం కూడా కొనలేని నాకు జంటనగరాల మధ్య పిలిచి మరీ మీరు ఇంటి స్థలం ఇచ్చారు. రాజకీయ కుట్రలు పన్ని అడ్డుకోవాలని చూసినా, మీరు ఆడపడుచులను ఆస్తి పరులు చేశారన్నా. మీ సాయాన్ని జీవితంలో మరిచిపోలేను. ఈ రోజు నాలాంటి వారికి పెద్ద పండగ. అన్నా.. నా గృహ ప్రవేశానికి మీరు రావాలి.
– గొట్టుముక్కల హైమావతి, తాడేపల్లి
అద్దె పెంచినప్పుడల్లా ఇల్లు మారే పరిస్థితి
అన్నా.. నాకు ముగ్గురు పిల్లలు. భర్త హోటల్‌లో పని చేస్తారు. 25 ఏళ్లుగా చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. చాలీచాలని ఆదాయం. ఇంటి అద్దె పెంచినప్పుడల్లా పిల్లి తన పిల్లల్ని తిప్పినట్టు ఇల్లు మారేదాన్ని. ఓసారి అత్తగారి అమ్మ చనిపోతే శవాన్ని కూడా ఇంటికి తీసుకురానీయలేదు. ఆ క్షణంలో ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. సొంతిల్లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనిపించింది. నాలాంటి మహిళకు సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నా. కానీ మీరు పెట్టిన వలంటీర్ మా ఇంటికి వచ్చి.. జగనన్న ఉచితంగా ఇల్లు ఇస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎంతగా అడ్డుపడినా మీరు శ్రీరాముడిలా వారిని జయించి మాకు యాగ ఫలాన్ని అందించారన్నా.
– లక్ష్మి, గుణదల, విజయవాడ
గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?
పేదలకు సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తుంటే.. హడావుడి చేస్తున్న వ్యక్తులు, గత ప్రభుత్వంలో భూములు లాక్కుని కనీసం పరిహారం చెల్లించని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? రైతులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారే తప్ప ఎటువంటి అన్యాయం చేయటం లేదు. కావాలనే పేదలకు మేలు జరగకుండా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుందని కుళ్లు బుద్ధితో కోర్టుకు వెళుతున్నారు. ఇక్కడి అభివృద్ధిపై రైతులు నిలదీయాల్సింది చంద్రబాబును.
– పి.గంగా భవాని, విజయవాడ
మంచి మనసున్న నాయకుడు
మాకు ఇల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సీఎంగా జగన్ పరిపాలన ప్రారంభించాక పేదలకు మంచి జరగటం మొదలైంది. మాకు ఇంటి స్థలం కేటాయించారు. కచ్చితంగా ఇల్లు కట్టించి అందజేసే మంచి మనసున్న నాయకుడు సీఎం జగన్. పేదలకు అండగా నేనున్నానే భరోసా కల్పించారు.
– షేక్ మస్తాన్‌బీ, మెల్లెంపూడి, గుంటూరు జిల్లా
ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు
మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్లో తలదాచుకుంటున్నాం. సీఎం జగన్ ఇంటి స్థలాలు ఇవ్వటం ద్వారా అందరికీ జాగా వచ్చింది. పేదలకు మంచి చేసేందుకు ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. పేదోళ్ల కష్టం తెలుసు కాబట్టే.. స్థలాలు అందజేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది.
– జాలాది రత్నకుమారి, ఆత్మకూరు, గుంటూరు జిల్లా
జగనన్న భరోసా కల్పించారు
మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు వచ్చిన స్థలం భవిష్యత్‌లో మా బిడ్డలకు అండగా ఉంటుంది. కరోనా సమయంలో నాకు పనిలేదు. అప్పుడు ప్రభుత్వ పథకాలు మమ్మల్ని ఆదుకుని నిలబెట్టాయి. అన్నీ చెప్పిన సమయంలోనే చేస్తున్నారు. భగవంతుని చల్లని చూపు ఈ ప్రభుత్వానికి ఉంటుంది.
– అబ్దుల్ వసీమ్, రేష్మా, మంగళగిరి, గుంటూరు జిల్లా
మా కోసం యుద్ధమే చేశారు
మా పొట్టకొట్టేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మా అందరి కోసం యుద్ధం చేసి విజయం సాధించారు. తాను గెలిచి మమ్మల్ని గెలిపించిన తీరు ఆధ్యంతం స్ఫూర్తిదాయకం. జగనన్న దయవల్ల మాకు ప్లాట్ వచ్చింది. అది తీసుకునేందుకు వచ్చాం.
– ఎ.భారతి, విజయవాడ
సమానత్వానికి నాంది
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రాజధానిలో సామాజిక సమానత్వానికి నాంది పలికినట్లయింది. పేదలు రాజధానిలో నివాసముంటే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనేది తప్పు అని దీని ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటి వరకు కొందరిదిగా ఉన్న అమరావతి ఇప్పుడు అందరిదైంది. ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం అంటే మామూలు విషయం కాదు. తద్వారా లబ్ధిదారులకు వ్యక్తిగత లాభంతో పాటు ఇక్కడ ఏర్పడే ఇళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాజధాని ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. పాలకులకు ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి నిర్ణయాలు సాధ్యం కావు.
– కె మధుబాబు, సీడీసీ డీన్, ఏఎన్‌యూ
ఈ అవకాశం ఎవరికీ రాలేదేమో..
35 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై సంతకం పెట్టే అవకాశం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదేమో. ఆ అవకాశం నాకు మాత్రమే దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో అత్యంత సంతోషకరమైన రోజు ఇది. ఈ అవకాశం రాష్ట్రంలో, దేశంలో ఏ అధికారికీ లభించి ఉండకపోవచ్చు.
– రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి, గుంటూరు జిల్లా
ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే
అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో అల్పాదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రమపడి పేదల కల సాకారం చేసింది. గతంలో ఎప్పడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ అంశంలో అందరూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.
– కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment