
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు అసత్య కథనాలను ప్రచురిస్తూ సీఎం వైఎస్ జగన్ పభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలోని ఉద్దేశాలు ఆ పత్రికల అధినేతలకు అర్థం కాకుంటే సంబంధిత అధికారులను అడిగితే వివరణ ఇచ్చేవారు కదా? అని ప్రశ్నించారు. కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసిందని, దాని ప్రకారమే జీవో విడుదల చేశామన్నారు.
ప్రభుత్వం ఏడాదిన్నరలోనే నవరత్నాలతో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తోందని, 90 శాతం హామీలను నెరవేర్చిందని, అలాంటప్పుడు ప్రజలపై భారం మోపాలని ఎందుకు భావిస్తుందని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆస్తి పన్ను ఎలా ఉండాలో కేంద్రమే సిఫార్సు చేసిందని తెలిపారు. దీన్ని ఎఫ్‌ఆర్‌బీఎంకు ముడి పెట్టిందని, రుణ పరిమితి ఈ సంస్కరణలు అమలు మీద ఆధారపడి ఉంటుందన్నారు. అయినా ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదని, స్థానిక సంస్థలకే అందచేస్తుందన్నారు. నీటి పన్నుపై కూడా అసత్య కథనాలు ప్రచురించారని మండిపడ్డారు.