AP: బియ్యం బండికి బ్రేక్‌ | Break for door delivery of ration goods | Sakshi
Sakshi News home page

AP: బియ్యం బండికి బ్రేక్‌

Published Fri, Aug 9 2024 6:02 AM | Last Updated on Fri, Aug 9 2024 2:01 PM

Break for door delivery of ration goods

ఇంటి వద్దకు రేషన్‌ చేరకుండా రాజకీయ కుట్ర 

పేదలకు మేలు చేస్తున్న పథకం రద్దుకు తాపత్రయం 

అదనపు భారం, అనవసర ఖర్చు అంటూ సాకులు 

డిపోలకు వెళ్లి బియ్యం ఎందుకు తెచ్చుకోలేరంటూ వినియోగదారులకు ఎదురు ప్రశ్న 

రోజువారీ పనులు వదులుకుని చౌక బియ్యం కోసం దశాబ్దాల పాటు పేదల పాట్లు 

మళ్లీ కూలి మానుకుని డిపోలకు వెళ్లి బారులు తీరాల్సిన అగత్యం కల్పిస్తున్న సర్కారు 

9,260 ఎండీయూ ఆపరేటర్లు, అదనంగా వేల మంది సహాయకుల ఉపాధి ప్రశ్నార్థకం 

ఎండీయూ వాహనాల్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దల అభాండాలు 

గత ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యం   

ఎండీయూ వ్యవస్థ రాకతో కార్డుదారులకు ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు 

50 ఏళ్లుగా డిపోల వద్ద క్యూలైన్ల అగచాట్ల సంస్కృతికి తెర దించిన వైఎస్‌ జగన్‌  

ఇది విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరాపల్లి పంచాయతీ  పరిధిలోని ఐటీడీఏ కాలనీ (ఎస్టీ కాలనీ). 45 ఏళ్ల కిందట ఏర్పడిన ఈ కాలనీకి వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రభుత్వ సేవలు నడిచొచ్చాయి. ప్రతి నెలా రేషన్‌ బండి ఇంటి వద్దకే వచ్చి బియ్యం పంపిణీ చేసింది. రెండు కి.మీ. దూరంలోని  కొండచాకరాపల్లి రేషన్‌ డిపో దగ్గరకు వెళ్లి రోజంతా క్యూలైన్లలో పడిగాపులు కాసే దుస్థితిని గత ప్రభుత్వం మార్చిందని మహిళలు గుర్తు చేసుకుంటున్నారు.

సాక్షి, అమరావతి: పౌర సేవల్లో వైఎస్సార్‌ సీపీ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ తిరుగులేని నిదర్శనం. కలలో కూడా ఎవరూ ఊహించనివి సాకారమయ్యాయి. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలను వివక్షకు తావులేకుండా పారదర్శకంగా చేరవేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే పంథాను కొనసాగించి పేదల ఇక్కట్లను తొలగిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశారు. పేదలు పనులు మానుకుని రోజంతా రేషన్‌ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితిని తప్పించారు.

రేషన్‌ బియ్యమంటే తినటానికి ఏమాత్రం పనికి రావనే గూడు కట్టుకుపోయిన అభిప్రాయాన్ని తొలగిస్తూ నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని కచ్చితమైన తూకంతో ప్యాకింగ్‌ చేసి మరీ పేదలకు ఇంటికే పంపించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఎండీయూ (ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ) వ్యవస్థకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిలోదకాలిస్తోంది. పేదలను మళ్లీ గత కాలపు చేదు జ్ఞాపకాలు, అవమానాలకు గురి చేసే విధంగా సన్నద్ధమైంది. 

ముక్కిపోయిన బియ్యం.. సకాలంలో దొరకని తిండి గింజలు.. అసలు అడిగితే సమాధానం లేని పాత రేషన్‌ విధానం ప్రవేశపెట్టేందుకు తాపత్రయపడుతోంది. ఎండీయూ వ్యవస్థ నిలిచిపోతే రేషన్‌ సరుకుల కోసం చౌక ధరల దుకాణాల దగ్గర మళ్లీ క్యూలైన్‌ల్లో బారులు తీరాల్సిన దుస్థితి తలెత్తనుంది. చౌక బియ్యంతోనే పొట్టపోసుకునే వృద్ధులు, దివ్యాంగుల దురవస్థ ఊహకు కూడా అందడం లేదు. 

దాదాపు కోటిన్నర మందికి తిప్పలు.. 
ఇన్నాళ్లూ ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ల ద్వారా నిరీ్ణత సమయం, తేదీతో సహా వినియోగదారులకు సందేశాలు వెళ్లేవి. ఇంట్లో యజమాని లేకున్నా కార్డుదారుల్లో ఏ ఒక్కరున్నా ఇబ్బంది లేకుండా బియ్యం తీసుకునేవారు. బియ్యం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూసేవారు కాదు. 

ఎండీయూ వ్యవస్థ రద్దు అయితే రేషన్‌ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజుకేటాయించాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఏపీలో 1.49 కోట్ల మంది కార్డుదారులుండగా వీరిలో రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే అధికం. సగటున కోటి మంది రేషన్‌ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కావాల్సిందే. వెళ్లిన రోజే రేషన్‌  అందుతుందనే నమ్మకం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి.  

సచివాలయాల వద్ద కూడా.. 
రాష్ట్రంలో 1.49 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులకు ఇప్పటిదాకా ఎండీయూ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ సమర్థంగా జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు సుమారు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ సరుకులు చేరవేస్తోంది. బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్‌ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చే వెసులుబాటు కల్పించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేసింది. ఎక్కడా రేషన్‌ డీలర్ల ఉపాధికి ఆటంకంకలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని నిలిపివేసి అక్రమాలకు తెర తీసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

వేల మంది ఉపాధి ప్రశ్నార్థకం.. 
రేషన్‌ పంపిణీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో  ‘ఇంటి వద్దకే రేషన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది. తద్వారా 9,260 మంది బడుగు, బలహీన వర్గాల యువతకు ఎండీయూ ఆపరేటర్లుగా ప్రతి నెలా నిర్వహణ ఖర్చుల కింద జీతం చెల్లిస్తూ ఉపాధి సైతం కల్పించింది. ఒక్కో ఎండీయూ వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా గత ప్రభుత్వం రూ.3.48 లక్షలు రాయితీ ఇచ్చింది. లబ్దిదారుడు కేవలం రూ.58 వేలు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణ సౌకర్యం కల్పించారు. 

90 శాతం రాయితీతో రేషన్‌ వాహనాలను అందించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఎండీయూలకు ఆరి్థక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. ఇప్పుడు వీరందరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాతే రేషన్‌ వినియోగం 90 శాతానికిపైగా పెరిగింది.

దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్‌ డోర్‌ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి. కానీ సమర్థంగా నిర్వహించేందుకు  గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థలు లేకపోవడంతో ఆలోచనలో పడ్డాయి. కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన వ్యవస్థలను ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

రేషన్‌ డోర్‌ డెలివరీ రద్దు చేద్దాం
2014లో రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇచ్చేవాళ్లం. బియ్యం డోర్‌ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోపభూయిష్టంగా సాగింది. ఇదే వాహనాలను బియ్యం అక్రమ రవాణాకు వాడుకున్నారు. ఇంటింటికీ రేషన్‌ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఎలా వాడుకోవాలో ప్రతిపాదనలతో రండి.

ఈనెల 2న పౌరసరఫరాల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు  దశాబ్దాల దుస్థితి

రేషన్‌ సరుకులు తీసుకోవాలంటే దశాబ్దాల పాటు ఓ ప్రహసనమే. పేదలు ఓ పూట పనులు మానుకుని సరుకుల కోసం వెళ్లినా షాపు తెరుస్తారో లేదో అనుమానమే. నిర్దేశించిన సమయంలో మాత్రమే వెళ్లి తీసుకోవాలి. వినియోగదారులు ముందే వెళ్లి కార్డులు వరుసగా లైన్లలో పెట్టాలి. సరుకులన్నీ కొలిచే ఇవ్వడం, తూకం వేసే వరకు ఆగాల్సిందే. ఇక రేషన్‌ డీలర్లు సొంత పనులపై ఎక్కడికైనా వెళితే వారు వచ్చేవరకు నిరీక్షించక తప్పదు. రోజువారీ కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకునే వారికి ఇది ఎంత ప్రయాస అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు.  

పక్కాగా పంపిణీ..
రేషన్‌ డీలర్‌ లేకపోతే ఆ నెలలో రేషన్‌ కచ్చితంగా ఆలస్యం అవుతుంది. అదే ఎండీయూ ఆపరేటర్‌ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్‌వో ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేసేలా గత ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోకి కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. అలాంటి చోట్ల అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్దిదారుల ఇళ్లకు రేషన్‌ చేరవేసింది.

రేషన్‌ డీలర్‌ బలవన్మరణం 
రేషన్‌షాపును టీడీపీ నేతలు వేరొకరికి కేటాయించిన ఫలితం 
ప్రొద్దుటూరు: టీడీపీ నేతలు తనకు జీవనా«ధారంగా ఉన్న రేషన్‌ షాపును తొలగించడంతో డీలర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. డీలర్‌ రామకృష్ణ (50) అలియాస్‌ కిట్టు గత పదేళ్లకు పైగా మున్సిపాలిటీ పరిధిలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద రేషన్‌షాపు నిర్వహిస్తున్నారు. వార్డు టీడీపీ కౌన్సిలర్‌ మహ్మద్‌ గౌస్‌ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ద్వారా ఇటీవల ఆ రేషన్‌షాపును తన బంధువులకు ఇప్పించుకున్నారు. 

ఈ విషయమై రామకృష్ణ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టీడీపీ నేత ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులను కలిసి ప్రాథేయపడినట్లు తెలిసింది. ఆయన అభ్యర్థనను ఎవరు పట్టించుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన ఆయన బుధవారం రాత్రి విషం తాగాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ గురువారం మృతిచెందాడు. 

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 70కిపైగా రేషన్‌ షాపులనుబెదిరించి, భయాందోళనలకు గురిచేసి స్వా«దీనం చేసుకున్నారు. 40 ఏళ్లుగానిర్వహిస్తున్న రేషన్‌ షాపులను అధికార పార్టీ నేతలు బలవంతంగా లాక్కున్నారు.  

అంగన్‌వాడీలు, హాస్టళ్లకు కష్టాలే.. 
నాణ్యమైన (సార్టెక్స్‌) బియ్యాన్ని లబ్దిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్‌ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్‌(అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్‌ బియ్యా­న్ని నేరుగా చేరవేస్తున్నారు. గతంలో అంగన్‌వాడీలు స్థానికంగా ఉన్న రేషన్‌ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్లు యాజమాన్యాలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి బియ్యాన్ని తెచ్చుకునేవి. 

ఒక రోజు ప్రత్యేకంగా దీని కోసం కేటాయించాల్సి వచ్చేది. రవాణా, లోడింగ్, అన్‌ లోడింగ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వీటన్నింటికీ పరిష్కారంగా గత ప్రభుత్వం రేషన్‌ను డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయించింది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది. ఎండీయూ వ్యవస్థ రద్దు అయితే అంగన్‌ వాడీలు, హాస్టళ్లకు మళ్లీ కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. 

అప్పట్లో తినేవారేరి? 
2014–19 మధ్య చంద్రబాబు హయాంలో  రేషన్‌ బియ్యం ఇంటికి తెచ్చుకోవడానికి,వండుకుని తినడానికి ప్రజలు నానా అవస్థలు పడేవారు. బియ్యం ముక్కిపోవటం... పురుగులు పట్టడం.. రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతోపాటు గింజలు రంగు మారికనిపించేవి. ఇదేంటని ప్రశి్నస్తే ఇంటికి తెచ్చుకున్న బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవడానికే సమయం పోయేది. ఈ దుస్థితిని గమనించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. 

కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్‌ బియ్యమే పేదల ఆకలి తీర్చింది. కార్డుదారుల సమక్షంలో ఇంటి వద్దే సంచులు తెరిచి కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గి­పోయాయి. ఈ–పోస్‌ యంత్రాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజిలెన్సు కమిటీలను ఏర్పాటుచేసి నిత్యం రేషన్‌ డోర్‌ డెలివరీని గత ప్రభుత్వం పర్యవేక్షించింది.

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం బైరందొడ్డిలోని 76 ఇళ్లలో 250 మంది నివాసం ఉంటున్నారు. 63 కుటుంబాలకు రేషన్‌ కార్డులున్నాయి. ఇది పులకుర్తి మజరా గ్రామం కావడంతో సంక్షేమ పథకాలు అందుకోవాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. రేషన్‌ కూడా అక్కడికే వెళ్లి తెచ్చుకునేవారు. వైఎస్‌ జగన్‌ హయాంలో వారు ఎక్కడికీ వెళ్లకుండా గ్రామంలోనే పథకాలు అందాయి. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ డోర్‌ డెలివరీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ వాహనాలు రద్దు చేస్తే మళ్లీ బియ్యం, సరుకుల కోసం మోసుకుని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

గిరిజన గ్రామాలకు మళ్లీ కష్టాలు.. 
మాది ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరి శిఖర గ్రామంచందనగిరి. గతంలో రేషన్‌ తీసుకోవడానికి ప్రతి నెల కుటుంబాలతో పనులు మానుకుని కాలినడకన పరశురాంపురం వెళ్లేవాళ్లం. అక్కడి నుంచి సరుకులు భుజాన మోసుకుని కొండపైకి వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడ్డాం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మా ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందించారు. దయచేసి మా ఇళ్ల వద్దకు వచ్చి మాకు రేషన్‌ సరుకులు అందించాలి.   – జన్ని సరోజిని, చందనగిరి గ్రామం, మెళియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా  

నడిచేకి కూడా చేతకాదు..! 
నాకు, నా భార్యకు వయసుపైబడింది. నడవడానికి కూడా చేతకాదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి రేషన్‌ బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు స్టోర్‌ దగ్గరికే పోయి తీసుకోవాలని చెబుతున్నారు. మేం స్టోర్‌కు ఎప్పుడు పోవాలి? బియ్యం ఎలా వేయించుకోవాలి? నడిచేందుకు కూడా శరీరం సహకరించడంలేదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు.   – తిమ్మప్ప, అండేపల్లి, కంబదూరు మండలం, అనంతపురం జిల్లా 

రేషన్‌ కోసం 6 కి.మీ. వెళ్లాలి 
మేం గతంలో మా ఊరు రాజాసాహెబ్‌పేట నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని కంబాలదిన్నెకు వెళ్లి రేషన్‌ సరుకులు తెచ్చుకునేవాళ్లం. దీనికోసం ఒక పూట కూలిపనులు మానుకుని వెళ్లాల్సి వచ్చేది. జగన్‌ హయాంలో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపారు. ఇకపై కూడా అలాగే ఇచ్చేలా చూడాలి.  – పి.నరసింహారావు, రాజాసాహెబ్‌పేట, పామూరు మండలం, ప్రకాశం జిల్లా 

ఆరోగ్యం దృష్ట్యా కదిలే పరిస్థితి లేదు  
నా వయసు 70 ఏళ్లకు పైనే. ఆరోగ్యం దృష్ట్యా కదిలే పరిస్థితి లేదు. నా కుమారుడు దుర్గానరేష్‌ వికలాంగుడు. నా భార్య వరలక్ష్మి వయసు సైతం ఎక్కువే. గత ప్రభుత్వంలో మా ఇంటి వద్దకు వచ్చి మరీ రేషన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్‌ షాపు వద్దకు వెళ్లాలని చెబుతున్నారు.   – కంచి నాగేశ్వరరావు, పెదపట్నంలంక, బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

జీవన భృతి పోగొట్టుకుని వేరే ఊరికి వెళ్లాలి 
గతంలో రేషన్‌ బియ్యం, సరుకులు తీసుకోవాలంటే రోజూవారి జీవన భృతి పోగొట్టుకొని వేరే ఊరికి ‡వెళ్లి క్యూలైన్లో నిలబడి సాయంత్రానికి వచ్చేవాళ్లం. పేదల సమస్యలు గుర్తించిన జగన్‌ ఇంటి­వద్దకే రేషన్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. మళ్లీ పక్క ఊరికి ఆటోలో వెళ్లి పని, కూలీ పోగొట్టుకుని క్యూలో నిలబడే పరిస్థితి కల్పిస్తున్నారు. పేదలపై కోపంతోనే జగనన్న పథకాలు తీసేస్తున్నారు.  – డమ్ము మహాలక్ష్మి, ఉర్లగడ్డపోడు, రైల్వేకోడూరుమండలం, అన్నమయ్య జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement