![A Brown branch should be set up in Anantapur - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/10/30/lib.jpg.webp?itok=yJVfGnU1)
కడప కల్చరల్: డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో నిర్మించిన సీపీ బ్రౌన్ గ్రంథాలయం శాఖను అనంతపురంలోనూ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్‌రావు సూచించారు. జానమద్ది అనంతపురం జిల్లాకు చెందినవారని, అందువల్ల అక్కడ కూడా బ్రౌన్ గ్రంథాలయ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) జయంతిని పురస్కరించుకుని జానమద్ది 11వ వార్షిక సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవం ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు.
జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత, ఆకాశవాణి విశ్రాంత అధికారి నాగసూరి వేణుగోపాల్‌కు జానమద్ది పురస్కారాన్ని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు ప్రదానం చేశారు. స్వయంకృషి, సాహిత్యాభిలాష, సామాజిక దృష్టి జానమద్ది ప్రత్యేకతలని, భావితరాలకు వాటిని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జానమద్ది సాహితీసేవ భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య చింతా సుధాకర్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయాన్ని సాహిత్యంతోపాటు కళానిలయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కవి యలమర్తి మధుసూదన ‘తెలుగు భాషా ప్రాశస్త్యం–పద్య వైభవం’పై స్మారకోపన్యాసం చేశారు. పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ తాను కడపలో పనిచేసిన సమయంలో బ్రౌన్ గ్రంథాలయం, జానమద్దితో అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులను జానమద్ది సాహితీపీఠం తరఫున సన్మానించారు. విజయవాడ దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జానమద్ది సాహితీపీఠం ట్రస్టీ విజయభాస్కర్, కార్యదర్శి యామిని, డాక్టర్ వైపీ వెంకటసుబ్బయ్య, జానమద్ది కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment