
ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, కడప/నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ జిల్లా బద్వేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆదివారం మృతిచెందారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు శనివారం ఆరోగ్యం విషమించడంతో కడప నాగరాజుపేటలోని అరుణాచల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6.46 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన తాడేపల్లి నుంచి కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని వెంకటసుబ్బయ్య నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ, వారి పిల్లలు హేమంత, తనయ్‌లను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. సీఎం జగన్‌తో పాటు ఎమ్మెల్యే భౌతికకాయానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, సి.రామచంద్రయ్య, జకియాఖానమ్, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, కడప నగర మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కమలమ్మ తదితరులు నివాళులర్పించారు. అలాగే ఎమ్మెల్యే మృతికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఎమ్మెల్యే ప్రస్థానం..
బద్వేల్ మున్సిపాలిటీ పరిధి మడకలవారిపల్లెలో రైతు కుటుంబానికి చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమారుడు డాక్టర్ వెంకటసుబ్బయ్య. 1960లో జన్మించిన ఆయన కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎంఎస్ పూర్తి చేశారు. కామినేని, అపోలో హాస్పిటళ్లలో కొంతకాలం వైద్య సేవలందించారు. కడపలో స్థిర నివాసం ఏర్పర్చుకుని ఎముకలు, కీళ్ల వ్యాధుల వైద్య నిపుణుడిగా ప్రజలకు విశేష సేవలందించారు. వెంకటసుబ్బయ్య సేవలను గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2016లో ఆయన్ను బద్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించింది. 2019లో బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య మృతికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
వైఎస్సార్‌సీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య మృతి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.