
సాక్షి, అమరావతి: చిన్న వ్యాపార సంస్థలకు విధించే పెనాల్టీలను తగ్గించడం, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటులో రాష్ట్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీ విజ్ఞానభవన్‌లో జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధికారులతో కలిసి బుగ్గన పాల్గొన్నారు.
రాష్ట్రం సూచించిన విధంగానే రూ.20 కోట్ల వ్యాపార పరిమాణం ఉన్న సంస్థలు రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినప్పుడు విధించే పెనాల్టీల సవరణకు కౌన్సిల్ అంగీకరించినట్లు తెలిపారు.
అప్పిలెట్ ట్రిబ్యునల్స్‌లో తీసుకోవాల్సిన సవరణల కోసం మంత్రుల కమిటీ సూచనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని, ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చోటు కల్పించడంతో పాటు, త్వరగా ఏర్పాటు చేయాలన్న సూచనలకు కౌన్సిల్ అంగీకరించిందని వెల్లడించారు.
జూన్, 2022 వరకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ.16,982 కోట్ల పరిహార బకాయిల చెల్లింపునకు కౌన్సిల్ అంగీకరించిందని, ఇందులో రాష్ట్రానికి సుమారు రూ.689 కోట్లు రావాల్సి ఉందన్నారు.సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి(వాణిజ్య పన్నులు) ఎన్.గుల్జార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment