
విశాఖలో సౌత్ జోన్ స్కిల్ పోటీల బ్రోచర్ ఆవిష్కరిస్తున్న చల్లా మధుసూదనరెడ్డి
ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్లే స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అడ్వయిజర్ చల్లా మధుసూదనరెడ్డి అన్నారు. నేషనల్ æస్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను స్కిల్ డెవెలప్‌మెంట్ అధికారులతో కలసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు.
విశాఖలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రంలో సౌత్ జోన్ స్కిల్ పోటీలు నిర్వహించడానికి అవకాశం కలిగిందన్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఆతిథ్యమిచ్చి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు, అక్కడ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 2022లో చైనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి 450 మంది విద్యార్థులు విశాఖ చేరుకున్నారన్నారు. వారికి 52 విభాగాలలో పోటీలు నిర్వహించడానికి నగరంలో 11 చోట్ల వేదికలు సిద్ధం చేశామన్నారు. వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment