మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం | Chandrababu Naidus Gang Is Threatening Witnesses In Assigned Land Case, Details Inside - Sakshi
Sakshi News home page

మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం

Published Fri, Dec 29 2023 5:28 AM | Last Updated on Fri, Dec 29 2023 3:20 PM

Chandrababus gang is threatening witnesses in assigned land case - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా.. యథేచ్ఛగా బరితెగించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన చంద్రబాబు ముఠా ఇప్పుడు మీ అంతు చూస్తామంటూ ఏకంగా ఉన్నతాధికారులకే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. మా అవినీతినే బయటపెడతారా అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అక్రమాలు, అవినీతితో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ముఠా కేసుల నుంచి తప్పించుకునేందుకు మరిన్ని వక్రమార్గాలు వెతుకుతోంది. ప్రధానంగా 950 ఎకరాల అసైన్డ్‌ భూముల బాగోతం ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో పచ్చ ముఠా ఠారెత్తిపోతోంది.

ఈ కేసులో న్యాయస్థానాల్లో సమర్పించిన అధికారుల వాంగ్మూలాలను కూడా గుప్పిట పట్టి మరీ సాక్షులను బెదిరిస్తుండటం విస్మయపరుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకం అని తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ అవినీతి దందాకు పాల్పడ్డారని.. అసైన్డ్‌ భూముల కేసులో కీలక అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రధానంగా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు అంతా తానై అసైన్డ్‌ భూముల దందాకు ఎలా పాల్పడిందో సవివరంగా వెల్లడించారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండటంతో చంద్రబాబు ముఠా బెంబేలెత్తుతోంది. దీంతో ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ కుట్రలకు తెరతీశారు.

సర్వం చేసింది చంద్రబాబే.. 
ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు, నారాయణ అమరావతిలో 950 ఎకరాల అసైన్డ్‌ భూములను తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్‌ జైన్, గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్‌ దండే, సీఆర్‌y­ీ ఏ కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్‌ స్పష్టం చేశారు.

ఆ మేరకు చట్ట నిబంధనలను ప్రస్తావిస్తూ నోట్‌ ఫైళ్లలో పేర్కొన్నారు. కానీ అసైన్డ్‌ భూములను ఎలాగైనా తమ హస్తగతం చేసు­కోవాలని భావించిన అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నతా­ధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములను తమ సన్నిహితులు, బినామీలకు బదలాయించారు. 

ఎస్సీ, ఎస్టీ రైతులను భయపెట్టి..
అసైన్డ్‌ భూములపై కన్నేసిన చంద్రబాబు ముఠా కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని రంగంలోకి దించింది. సీఆర్‌డీఏ అధికారులను గ్రామాల్లోకి పంపించి అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రాజధాని కోసం తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ రైతులను బెదరగొట్టారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి ద్వారా తమ ఏజెంట్లను గ్రామాల్లోకి పంపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి కారుచౌకగా భూములను నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులకు విస్మయకర వాస్తవాలు తెలిశాయి. తాము అభ్యంతరం తెలిపినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని ఉన్నతాధికారులు అజయ్‌ జైన్, కాంతిలాల్‌ దండే, చెరుకూరి శ్రీధర్‌ సీఐడీకి తెలిపారు. అంతేకాకుండా ఆ మేరకు 164 సీఆర్‌పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసైన్డ్‌ భూముల కేసు విచారణలో వారి వాంగ్మూలాలు అత్యంత కీలకంగా మారాయి. 

అప్రూవర్‌గా మారతానన్న బ్రహ్మానందరెడ్డి 
మరోవైపు చంద్రబాబు ఒత్తిడితోనే ఎస్సీ, ఎస్టీ రైతులను మోసగించి అసైన్డ్‌ భూములు కొల్లగొ­ట్టామని బ్రహ్మానందరెడ్డి కూడా అంగీకరించారు. ఆ మేరకు తాను అప్రూవర్‌గా మారి కేసు దర్యాప్తునకు సహకరించేందుకు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన వాంగ్మూలం కూడా అసైన్డ్‌ భూముల కేసు దర్యాప్తులో ప్రధాన పాత్ర పోషించనుంది.

కేసును నీరుగార్చేందుకు రంగంలోకి బాబు ముఠా
తమ భూబాగోతం బట్టబయలు అవుతుండటంతో చంద్రబాబు ముఠా బెంబేలెత్తింది. దీంతో కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు రంగంలోకి దిగింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఉన్నతాధికారులు అజయ్‌ జైన్, కాంతిలాల్‌ దండే, చెరుకూరి శ్రీధర్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బ్రహ్మానందరెడ్డిలను లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే చంద్రబాబుపై కేసులో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని.. వారిని వదిలేది లేదని మీడియా ముఖంగా నారా లోకేశ్‌ హెచ్చరించడం గమనార్హం. అధికారుల పేర్లను రెడ్‌ డైరీలో రాశానని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టేది లేదని.. అంతు చూస్తానని బెదిరించడం లోకేశ్‌ బరితెగింపునకు నిదర్శనం.

మరోవైపు ఏసీబీ న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను కూడా టీడీపీ పెద్దలు తీసుకోవడంతో ఈ వ్యవహారం సున్నితంగా మారింది. ఏకంగా అజయ్‌ జైన్, కాంతిలాల్‌ దండే, చెరుకూరి శ్రీధర్‌ వంటి ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఐఏఎస్‌ అధికారులనే టీడీపీ పెద్దలు బెదిరిస్తుంటే.. ఇక తమ పరిస్థితి ఏమిటని ఎస్సీ, ఎస్టీ అసైన్డ్‌ రైతులు బెంబేలెత్తుతున్నారు. అలాగే అప్రూవర్‌గా మారతానని పిటిషన్‌ దాఖలు చేసిన బ్రహ్మానందరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తుండటంతో ఆయన ఆందోళన చెందుతున్నారు.

అధికారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
చంద్రబాబు ముఠా బెదిరింపుల నేపథ్యంలో సీనియర్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌ విజ్ఞప్తిపై ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది. అజయ్‌ జైన్, కాంతిలాల్‌ దండేల పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి భద్రత పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోవైపు ఈ వ్యవహారంపై సీఐడీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఉన్నతాధికారులు 164 సీఆర్‌పీసీ కింద ఇచ్చిన వాంగ్మూలాల కాపీలు బయటకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement