అనుమానాస్పద, అధిక మొత్తం లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు అందజేయండి
అక్టోబరు నుంచి రోజులో రూ.10 లక్షలు దాటిన..
30 రోజుల్లో రూ.50 లక్షలు మించి చేసిన లావాదేవీల వివరాలివ్వండి
బ్యాంకర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశం
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్‌ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు.
ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్‌ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు.
అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్‌ఈసీ కోరారు.
ప్రలోభాలపై నిఘా..
ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు.
ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్‌ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్‌ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు.
ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను..
ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు.
ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు.
నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment