సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిని, పలు కులాలను అవమానించేలా నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని, ఇది ఐపీసీ కింద నేరమని వివరించారు. ప్రతిపక్ష పార్టీ, రెండు వార్తా చానళ్లతో కలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రఘురామకృష్ణరాజుకు పరిపాటిగా మారిందని అన్నారు. రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి డియర్ పాస్టర్స్ అని సంభోధిస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు.
ముఖ్యమంత్రిని, ఇతర కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తనని ప్రజలు జోకర్‌గా భావించి తన వ్యాఖ్యలను పట్టించుకోలేదని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తున్నారని ఏజీ తెలిపారు. ఆయన జోకర్ కావొచ్చునని, పాలన అంటే సర్కస్ మాత్రం కాదని వివరించారు.
ఆయనపై నమోదు చేసిన దేశద్రోహం కేసుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించిందని, మిగిలిన నేరాలపై దర్యాప్తు కొనసాగించవచ్చని చెప్పిందన్నారు. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని కూడా ఆయన్ని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణకు మించి ఆయన ఇంకా ఎక్కువ రక్షణ కోరుతున్నారని, అందుకు చట్టం అనుమతించదని తెలిపారు. గతంలో విచారణకు వచ్చినప్పుడు సీఐడీ హింసించిందని, అందువల్ల ఇప్పుడు సీఐడీ వద్దకు రాలేనని, తన ఇంటికే అధికారులు రావాలన్న రఘురామకృష్ణరాజు వాదనను ఏజీ తోసిపుచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు ఇంటికి వెళితే, వారిని కాల్చేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించిన ఘనుడని, అందువల్ల ఆయన ఇంటికెళ్లే ప్రసక్తే లేదన్నారు. పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన్ని విచారించే ప్రక్రియను వీడియో తీస్తామని అన్నారు.
మరికొందరితో కలిపి ఆయన్ని విచారించాల్సి ఉంటుందని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. సీఐడీ పిలిచిన చోటకి వెళ్లే పరిస్థితి లేదని, మరోసారి దాడి చేయడమో, ఇతర కేసుల్లో అరెస్ట్ చేయడమో చేసే అవకాశం ఉందని అన్నారు. ఆన్‌లైన్‌లో లేదా హైదరాబాద్‌లోని పిటిషనర్ ఇంట్లో విచారణ జరపాలని కోరారు. ఈ ప్రతిపాదనను ఏజీ వ్యతిరేకించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందన్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో విచారించడమా? లేక తటస్థ ప్రదేశంలోనా అన్నది తెలపాలని సీఐడీకి సూచించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment