ఆటంకం లేకుండా ఆక్సిజన్‌  | CM Jagan orders in high-level review on Covid and Cyclone Yaas | Sakshi
Sakshi News home page

ఆటంకం లేకుండా ఆక్సిజన్‌ 

Published Tue, May 25 2021 2:51 AM | Last Updated on Tue, May 25 2021 8:04 AM

CM Jagan orders in high-level review on Covid and Cyclone Yaas - Sakshi

విద్యుత్తు.. ఆక్సిజన్‌ కీలకం
‘‘తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. తుపాను వల్ల ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ సేకరణకు ఇబ్బందులు తలెత్తితే ముందే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలి. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో సమస్యలు లేకుండా డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విద్యుత్‌ సిబ్బందిని కేటాయించాలి. తుపాను ప్రభావిత సమయాల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’’
– ముఖ్యమంత్రి జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఆక్సిజన్‌ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి కల్లా ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కూడా ఉండాలన్నారు. సొంతంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పే ప్రైవేట్‌ ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్‌ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యానికి తగినట్లుగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలో కోవిడ్, తుపాన్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ‘యాస్‌’ తుపాను వల్ల ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రోజువారీ సరఫరా, నిల్వలపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్‌ విశాఖపట్నం వెళ్లారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ...
కోవిడ్, తుపాన్‌ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్, మంత్రి ఆళ్ల నాని తదితరులు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి..
తుపాన్‌ నేపథ్యంలో రోజువారీ అవసరమైన ఆక్సిజన్‌ సరఫరాతో పాటు నిల్వల వివరాలు పరిశీలిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. 15 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను రప్పిస్తున్నందున నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సక్రమంగా పని చేసేలా తగిన వ్యవస్థ ఉండాలి. 

కోవిడ్‌ బాధితుల తరలింపులో జాగ్రత్త..
యాస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి తరలించాలో గుర్తించి తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని జాగ్రత్తగా తరలించాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్‌ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే ఇప్పుడే ఆ పని చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు వెంటనే ప్రారంభం కావాలి.  సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు అన్ని సదుపాయాలు కల్పించాలి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను సమీక్షించుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. 

మెడికల్‌ కాలేజీలు – టెండర్లు..
పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయాలి. జూన్‌ 10 కల్లా మిగిలిన కాలేజీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. జులై నుంచి మెడికల్‌ కాలేజీల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

విమ్స్, విక్టోరియాలో చురుగ్గా నాడు – నేడు
ఇప్పుడున్న 11 మెడికల్‌ కాలేజీలతో పాటు అదనంగా విశాఖలోని విమ్స్, విక్టోరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులకు చురుగ్గా టెండర్ల ప్రక్రియ చేపట్టాలి. ఆగస్టు నెలాఖరు కల్లా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. అనుకున్న సమయానికి పనులు ప్రారంభం కావాలి.

కార్పొరేట్‌ స్థాయిలో బోధనాస్పత్రుల నిర్వహణ..
కార్పొరేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే బోధనాసుపత్రుల నిర్వహణ కూడా ఉండాలి. రోగులకు ఇచ్చే ఆహారం నుంచి పారిశుద్ధ్యం వరకూ అన్నీ నాణ్యంగా ఉండాలి. పది కాలాల పాటు రోగులకు మంచి సేవలు అందించేలా అన్ని బోధనాసుపత్రులు ఉండాలి. ఈ ఆస్పత్రులను ఏ విధంగా నిర్వహిస్తారన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందించండి. కోవిడ్‌ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితులపై బ్లాక్‌ ఫంగస్‌తోపాటు కొత్తగా వైట్‌ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసురుతున్నట్లు సమాచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. తగినన్ని ఇంజెక్షను తెప్పించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 
 
ఆ చిన్నారుల పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్‌
కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 34 మంది చిన్నారులను ఇప్పటివరకు గుర్తించినట్లు అధికారులు తెలియచేయడంతో ఆర్థిక అవసరాలు తీర్చేలా వెంటనే వారందరి పేరు మీద రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

18,763 మంది సిబ్బంది నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం 36,475 మంది కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 18,763 మంది వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి 590 టన్నుల ఆక్సిజన్‌ కేటాయింపులు ఉండగా ప్రస్తుతం రోజూ దాదాపు 640 టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవుతోందని తెలిపారు. సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ  సీఈవో డాక్టర్‌ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement