అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌పై సమీక్ష సందర్భంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు చెప్పారు. సమీక్ష సందర్భంగా... ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మరణించారంటూ ‘ఈనాడు’ రాసిన కథనాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను వివరిస్తూ... విషమ పరిస్థితుల్లో ఉన్న పి.దొరబాబు అనే వ్యక్తిని మే 25న ఆశ్రమ్ ఆస్పత్రిలో చేర్చారని, ఆ వ్యక్తికి డయాబెటిస్ సహా ఇతర దీర్ఘకాలిక సమస్యలున్నాయని, 25 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి జూన్ 26న మరణించారని చెప్పారు.
మిగిలిన ఇద్దరూ కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... ‘‘అయినా ఇపుడు రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ చాలా విరివిగా ఉంది. మన అవసరాలకన్నా ఉత్పత్తి ఎక్కువ ఉన్నపుడు కొరత ఎలా వస్తుంది? మనసులో కుళ్లుకుతంత్రాలు ఉంటేనే ఇలాంటి వార్తలు రాస్తారు. కోవిడ్ పీక్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అబద్దాలు రాసి ఉంటే కనీసం నమ్మైనా నమ్ముతారు కానీ ఇపుడు కోవిడ్ తగ్గి 70 శాతానికిపైగా ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నా ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు మానవత్వం ఉందా?’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేకే తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారాయన. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పీక్ స్థాయిలో ఉన్నపుడు 750 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను వినియోగించామని, ప్రస్తుతం అది 180 టన్నులకు తగ్గిందని అధికారులు చెప్పగా... ఇలాంటి పరిస్థితిలో ఆక్సిజన్ లేకే ముగ్గురు చనిపోయారని నిస్సిగ్గుగా వార్తలు రాశారంటూ సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వార్తల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు.
కోవిడ్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని, అధికారులు
ఎలా రాయగలుగుతున్నారసలు?
కోవిడ్ తీవ్రతను చులకన చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడినట్లుగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో అందరు అధికారుల ఎదుట కరోనా తీవ్రతను చులకన చేసి మాట్లాడినట్లుగా, అర్థరాత్రి జీసస్‌తో సంభాషించినట్లుగా ఉద్దేశపూర్వకంగా రాసిందన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా గత ఏడాది ప్రారంభంలో ఇలాగే చులకనగా మాట్లాడారు. కరోనా వైరస్‌లేదు.. ఏమీ లేదు. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను. అసలు వైరస్‌లేదు.. భయపడవద్దు అని జీసస్ చెప్పారు. అని జగన్‌రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు’’ అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయనకు చూపించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... అసలు ఎవరైనా ఇలాంటి రాతలు ఎలా రాయగలుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇలాంటి రాతలు ద్వారా ముఖ్యమంత్రి పదవికి విలువ తగ్గించి, దాన్ని అథమస్థాయిలోకి తీసుకెళ్తున్నారు.
చేతిలో ఒక పత్రిక, ఒక టీవీ ఉందని ఇలాంటి రాతలు రాయటమేనా? కోవిడ్ నివారణా చర్యలపై ఇంత సీరియస్‌గా సమీక్షలు చేస్తుంటే.. వాటిని అపహాస్యం చేసేలా ఇలాంటి రాతలు రాయడం అత్యంత దురదృష్టకరం. ఇంతమంది అధికారులకు టైంపాస్‌కాక రివ్యూలకు హాజరవుతున్నారా? కరోనా మీద ప్రభుత్వం సీరియస్‌గా లేకపోతే వారానికి రెండు రోజుల పాటు సమీక్షలు చేస్తుందా? ఈ వార్తలు రాసేవారికి కనీసం ఎక్కడోచోటైనా విలువలుండాలి కదా? మీకు ఏది రాయాలనిపిస్తే అలా రాసేస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి వచ్చిన మంచిపేరు తనకు మాత్రమే కాదని... అందరు అధికారులు, సిబ్బందికి కూడా అని, అంతా కలిసికట్టుగా పనిచేశారని సీఎం వ్యాఖ్యనించారు. ధ్యాసపెట్టి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం కనకే మంచిపేరు వస్తోందన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మొదలుపెడితే... గ్రామస్థాయిలో ఉన్న ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, వాలంటీర్లు, కలెక్టర్లు, జిల్లా, మండల అధికారులు, వైద్య సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడంవల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ రెండు పత్రికల కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు చెప్పారు.
కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు
Published Tue, Jun 29 2021 2:51 AM | Last Updated on Tue, Jun 29 2021 9:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment