సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్ – 3 ఎంచుకున్న లబ్ధిదారుల గృహ నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ) పాటించాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ఈ నెలాఖరులోగా స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులకు నిర్దేశించారు.
పేదల ఇళ్ల నిర్మాణాలు, 90 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ ప్రగతిని అధికారులు వివరించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో అవసరమైన చోట్ల ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే...
ప్రత్యామ్నాయ ప్రణాళికలు
ఆప్షన్–3 ఇళ్లను నిర్మించే కాంట్రాక్టర్లు పనులపై ఎస్‌ఓపీలు రూపొందించాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో సమకూర్చుకున్నారా? ఇటుకల తయారీ యూనిట్లు కాలనీలకు సమీపంలోనే ఏర్పాటయ్యాయా? తదితర అంశాలు అందులో ఉండాలి. ఎస్‌ఓపీల ప్రకారం అధికారులు పర్యవేక్షించాలి. గోడౌన్లతోపాటు నీరు, విద్యుత్ సరఫరా లాంటి కనీస సదుపాయాలను కాలనీల్లో సమకూర్చుకుని నిర్మాణాలను వేగంగా చేపట్టాలి. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ఈ నెలాఖరులోగా స్పష్టత కోసం ప్రయత్నించాలి. స్పష్టత రాని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి.
ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఎక్కడ ఇంటి స్థలాన్ని ఇచ్చారో చూపించడమే కాకుండా పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలి. స్థలాన్ని సమకూర్చడంతోపాటు పట్టా, ఇతర డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.
హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఎండీ నారాయణ భరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతలో రాజీ వద్దు
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. కాలనీల్లో డ్రైన్లు సహా విద్యుత్, నీటి సరఫరా లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులు ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఇళ్లకు సమకూర్చే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్ లైట్లు నాణ్యమైనవిగా ఉండాలి. కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మునిసిపాలిటీలే వెలుస్తున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పౌర సేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment