సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవతను చాటుకున్నారు. ఎక్కడ ఎటువంటి బాధితులు కనిపించినా వెంటనే వారికి తగిన సహాయాన్ని అందించే సీఎం జగన్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులోనూ పలువురికి అండగా నిలిచారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన బహిరంగ సభ అనంతరం హెలీపాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివిధ సమస్యలతో బాధపడుతున్న 20 మంది వారి సమస్యలు వివరించారు.
తమను వైద్యపరంగా, ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి బాధితులందరికీ అవసరమైన వైద్యం, ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రానికి బాధితులకు అధికారులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అవసరమైన వారికి వైద్య సాయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలివీ..
నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన బి. గోపి రైలు ప్రమాదంలో గాయపడ్డాడు. తన దీనస్థితిని సీఎం జగన్‌కు ఆయన వివరించారు. ఆదుకోవాలని కోరారు. సీఎం వెంటనే స్పందించి గోపికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు వెంటనే అధికారులు రూ.5 లక్షలు అందించారు.
నూజెండ్ల మండలం తిమ్మాపురానికి చెందిన కుక్కమూడి సుబ్బారావు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
నంద్యాలకు చెందిన కె. మార్తమ్మ మూర్ఛవ్యాధితో బాధపడుతున్నానని, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని కోరారు. ఆమెకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అందించి ఉద్యోగ కల్పన విషయమై నంద్యాల కలెక్టర్‌కు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఆమెకు ఆర్థిక సాయం అందించారు.
బెల్లంకొండ మండలం మాచయపాలేనికి చెందిన పున్నారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో ఆయనకు తక్షణ సాయంగా రూ.లక్షన్నర అందించాలని, ఉచిత డయాలసిస్, మందులు అందించాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అధికారులు
వెంటనే చెక్కు అందించారు.
అచ్చంపేట మండలం ముత్యాలకు చెందిన పువ్వాడ సాయికి చెయ్యి విరిగింది. ఆమె పరిస్థితిని విన్న సీఎం జగన్ లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వడంతోపాటు ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఆయనకు ఆర్థిక సాయం అందించారు.
► పిడుగురాళ్ల మండలం పత్తిగుంటలకు చెందిన మాస్టర్ మొహమ్మద్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రెహ్మాన్ ఇద్దరూ మూర్చవ్యాధితో బాధపడుతున్నారు. వారికి చెరొక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి, ఉచితంగా వైద్యం అందజేయాలని సీఎం ఆదేశించారు. వారికి అధికారులు చెక్కులు అందించారు.
► క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన దుర్గారావు పశుమిత్రగా నియమించాలని కోరారు. అతనికి స్వయం ఉపాధి కోసం రెండు లక్షల తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు వెంటనే ఆయనకు చెక్కు అందించారు.
► నరసరావుపేట మండలానికి చెందిన ఇందిర తనకు ఉద్యోగం కావాలని కోరడంతో లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆమె కుమారుడికి స్వయం ఉపాధి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆమెకు రూ.లక్ష చెక్కు అందించారు.
► నూజెండ్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కుప్పల మరియమ్మ భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పగా సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
► అంగ వైకల్యంతో బాధ పడుతున్న క్రోసూరుకు చెందిన షేక్ సుభానికి తక్షణ ఆర్థిక సాయం కింద లక్ష రూపాయలు అందజేయాలని సీఎం ఆదేశించారు. ఆమేరకు అధికారులు ఆర్థిక సాయం అందించారు.
► దుర్గి మండలం నెహ్రూనగర్ తాండాకు చెందిన బాలునాయక్ కడుపులో ట్యూమర్లతో బాధపడుతున్నారు. అతని పరిస్థితిని విన్న సీఎం జగన్ అతనికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, పింఛన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆతనికి అధికారులు రూ.లక్ష చెక్కు అందించారు.
► నంద్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌కు స్వయం ఉపాధి కోసం రెండు లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించగా, అధికారులు ఆమేరకు చెక్కు అందించారు.
► క్రోసూరుకు చెందిన షేక్ అమాన్ వెన్నెముక సమస్యతో బాధపడుతుండటంతో తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించడంతోపాటు నాణ్యమైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చెక్కు అందించారు.
► క్రోసూరు మండలం ఇస్సపాలేనికి చెందిన కుమ్మరిగుంట మంజుల కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు ఉచిత వైద్యంతో పాటు లక్ష రూపాయలు సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రానికే ఆమెకు రూ.లక్ష చెక్కును అధికారులు అందించారు.
► అంగవైకల్యంతో బాధపడుతున్న పెదకూరపాడుకు చెందిన ఆదాం షఫీకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంత్రానికి అధికారులు ఆయనకు రూ. లక్ష చెక్కు ఇచ్చారు.
► గుండె జబ్బుతో బాధపడుతున్న కోసూరు మండలం గుడిపాడుకు చెందిన షేక్ కాజా షరీఫ్‌కు లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం, ఉచితంగా వైద్యం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆయనకు రూ.లక్ష చెక్కు ఇచ్చారు.
► తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పెదకూరపాడు మండలం లగడపాటికి చెందిన హాకీ హసన్ సాహెబ్‌కు సీఎం ఆదేశాల మేరకు అధికారులు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
► క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఇమామ్ బాషాకి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అతనికి లక్ష రూపాయల చెక్కు పంపిణీతోపాటు ఏదైనా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
► సంతమాగులూరు మండలం పరిటాల వారి పాలేనికి చెందిన గంజనబోయిన చరణ్ తలసేమియా బాధితుడు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతనికి జిల్లా కలెక్టర్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇతనికి గతంలోనే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు మరోసారి ఆర్థిక సహాయం అందించారు. బాధితుడికి అత్యున్నత ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు.
► తాడేపల్లి మండలం పెనుమాకకి చెందిన కె అరవింద్‌కి మెదడు ఆపరేషన్ కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష రూపాయిలు తక్షణ సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment