
సాక్షి, బెంగళూరు/సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్‌సుందర్‌రెడ్డి (42) కరోనా కారణంగా కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన 15 రోజుల పాటు అక్కడి అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. వారు కూడా కరోనా బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు.
పార్టీలో శ్యామ్‌గా చిరపరిచితుడైన ఆయన బెంగళూరులో పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలో జరిగిన పలు ఎన్నికల్లో తన ఐటీ బృందంతో కలసి పార్టీ విజయానికి ఎంతో కృషిచేశారు. అహర్నిశలు పార్టీ కోసం శ్యామ్ కష్టపడ్డారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శ్యామ్ స్వగ్రామం చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం కొత్తపల్లిలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
సీఎం వైఎస్ జగన్ సంతాపం
శ్యామ్ కలకడ మృతిపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ సతీమణి సుప్రియకు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. శ్యామ్ మృతి పట్ల పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేశారంటూ శ్యామ్ సేవలను కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment