పునాదిపాడులో రేపు ‘జగనన్న విద్యాకానుక’ | CM YS Jagan Mohan Reddy Reaches Punadipadu Over Jagananna Vidyakanuka | Sakshi
Sakshi News home page

జడ్పీహెచ్‌ పాఠశాలలో జగనన్న విద్యా కానుక ప్రారంభం

Published Wed, Oct 7 2020 7:03 PM | Last Updated on Wed, Oct 7 2020 8:49 PM

CM YS Jagan Mohan Reddy Reaches Punadipadu Over Jagananna Vidyakanuka - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్టోబరు 8న (గురువారం) ప్రారంభం కానుందని పాఠశాల విద్యాశాఖా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉదయం ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం10.20 గంటలకు కంకిపాడు మండలం పునాదిపాడుకు చేరుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు. అనంతరం జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేస్తారు. ఈ కిట్టులో స్కూల్ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్స్, 1 జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వర్క్ బుక్స్ కూడా అందజేస్తుంది. అంతేకాక యూనిఫామ్ కుట్టు కూలీ కూడా తల్లుల అకౌంట్‌లో జమ చేయనున్నారు. ఇక విద్యా కానుక కోసం ప్రభుత్వం సుమారు 650 కోట్ల రుపాయలు ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రాష్ట్రంలో 42, 34, 322 మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారని తెలిపారు. (ఏపీ: ప్రాథమిక విద్యలో కీలక సం‍స్కరణలు)

ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్కు బుక్స్.. 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు ‘స్టూడెంట్ కిట్’ గా ఇస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఎలాంటి అపోహలు వద్దు
కోవిడ్-19 మహమ్మారి  నేపథ్యంలో పిల్లల ఆరోగ్య భద్రతా దృష్ట్యా, ప్రభుత్వ ఆదేశాలు మేరకు భౌతిక దూరం పాటిస్తూ ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల్లో కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు తెలిపారు. ‘మాకు అందలేదని’ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళన చెందవద్దని కోరారు. యూడైస్,  చైల్డ్ ఇన్పోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ‘జగనన్న విద్యా కానుక’ కిట్ అందుతుందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీలలో, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చెందిన కిట్లు ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందాయని తెలిపారు. విద్యార్థులు ఈలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా లేదా, స్వయంగా స్కూల్‌కి వెళ్లి తీసుకోవాలని కోరారు. (చదవండి: ఒకే వేదికపైకి  వంద విదేశీ వర్సిటీలు )

‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో బ్యాగు కానీ, షూ కానీ, బెల్టు, యూనిఫాం వంటి వాటిల్లో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ ఉన్నా, ఆ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళన చెందవద్దన్నారు. వారు వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లేదా మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని కోరారు. కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయోమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు. ‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే 91212 96051, 91212 96052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జగన్ అన్న విద్యా కానుక రేపు ఉదయం పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. సీఎం జనగ్‌ విద్యా రంగంలో చరితాత్రకమైన  మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు-నేడు తొలి విడతలో 12,500 పాఠశాలకు మహర్దశ పట్టింది. ఇక జగనన్న విద్యా కానుకలో భాగంగా 43 లక్షల మంది విద్యార్థులకు కిట్‌లు అందజేస్తాం అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement