9 నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ | CM YS Jagan in review with Andhra Pradesh collectors | Sakshi
Sakshi News home page

9 నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

Published Tue, Nov 7 2023 4:02 AM | Last Updated on Tue, Nov 7 2023 9:57 AM

CM YS Jagan in review with Andhra Pradesh collectors - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఏం మేలు జరిగిందన్నది ప్రతి ఒక్కరికీ తెలియాలి. గ్రామాల వారీగా ఎంత ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) చేశాం.. తద్వారా ఎంతమందికి ఏ మేరకు లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి. అలాగే..

► గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా ఎంతెంత లబ్ధిపొందారో, ఎంత మంచి జరిగిందో వారికి చెప్పాలి. 
► డీబీటీ ద్వారా, నాన్‌ డీబీటీ ద్వారా ఏయే పథకాలలో ఎంత మేలు పొందుతున్నారో వివరించాలి. 
► మన ప్రభుత్వంలో ఏయే పథకాలు అమలవుతున్నాయో కూడా చెప్పాలి. 
► ఒకవేళ ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. 
► అదే విధంగా.. గ్రామంలోని పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా వచ్చిన మార్పులు.. ఇంగ్లిష్‌ మీడియం, పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే ఐఎఫ్‌ఫీ ప్యానెల్స్, ఎనిమిదో తరగతిలో ట్యాబుల పంపిణీ వరకూ మారుతున్న విద్యా వ్యవస్థ గురించి చెప్పాలి. 
► వైద్య రంగంలో విలేజ్‌ క్లినిక్స్‌తో సహా గ్రామంలో వచ్చిన మార్పు గురించి తెలియజేయాలి. 
► ఆర్బీకేల వంటి వ్యవస్థతో పాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు.. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్‌ చేపడుతున్న విషయం, ఏ రకంగా పారదర్శకత పాటిస్తున్నామో కూడా చెప్పాలి. 
► ఇక సోషల్‌ ఆడిట్‌ ద్వారా నాణ్యంగా అందుతున్న పౌర సేవలు, దిశ యాప్, తదితర అంశాలన్నింటిపైనా ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలి.
సమీక్ష సమావేశంలో కలెక్టర్లకు సూచనలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

ఆధారాలతో జరిగిన మంచిని చూపించాలి..
మరోవైపు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు, పథకాలను అమలుచేస్తున్నాం. ఈ క్రమంలో.. ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి ప్రజలకు చెప్పాలి. ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడెలా ఉన్నాం? అన్న అంశాలనూ వివరించాలి. డీబీటీ, నాన్‌ డీబీటీ, గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించాలి. ఈ వివరాలతో కూడిన డేటాతో సహా, జరిగిన మంచిని ఆధారాలతో చూపించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. పథకాలను ఏ రకంగా వాడుకోవాలన్న దానిపైనా వారికి అవగాహన కల్పించాలి.

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు కూడా పెట్టాలి. ఏయే పథకం ద్వారా ఎంతమంది లబ్ధిపొందారో వాటిల్లో ప్రదర్శించాలి. డీబీటీ ఎంత? నాన్‌ డీబీటీ ఎంతో అందులో పొందుపరచాలి. నాడు–నేడు ద్వారా చేసిన ఖర్చెంత? గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ కోసం ఎంత ఖర్చుచేశామో చెప్పాలి. అలాగే, గడపగడపకూ మన ప్రభుత్వం (జీజీఎంపీ) ద్వారా గుర్తించిన ప్రాధాన్యతా కార్యక్రమాల కోసం చేసిన ఖర్చును వివరించాలి.

ప్రతి మండలంలో రోజుకు ఒక సచివాలయంలో..
ప్రతి మండలంలో ప్రతిరోజూ ఒక సచివాలయంలో ఈ కార్యక్రమం చేపట్టాలి. పట్టణాల్లోనూ ఒక సచివాలయంలో నిర్వహించాలి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ ఈఓ, పట్టణ ప్రాంతాల్లో అడిషనల్‌ కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ ఇందులో పాల్గొంటారు. తొమ్మిదో తేదీ నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత తగిన సమయం తీసుకుని వలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని అభిమానించే వారు ఎవరైనా జరిగిన మంచి ఏమిటన్నది ప్రతి ఇంటికీ వివరిస్తారు. గతానికి భిన్నంగా పరిస్థితులెలా మెరుగుపడ్డాయి, ఎంత మంచి జరిగిందన్న దానిని ప్రతి ఇంటికీ తీసుకెళ్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement