AP: మెగా టోర్నీ మొదలైంది | CM YS Jagan Started Aadudam Andhra Mega tournament | Sakshi
Sakshi News home page

ఏపీలో మెగా టోర్నీ మొదలైంది

Published Wed, Dec 27 2023 4:08 AM | Last Updated on Wed, Dec 27 2023 1:08 PM

CM YS Jagan Started Aadudam Andhra Mega tournament - Sakshi

గుంటూరు జిల్లా నల్లపాడులో క్రీడా జ్యోతిని వెలిగించి ‘ఆడుదాం ఆంధ్రా’ను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి రోజా, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ తదితరులు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఆడుదాం ఆంధ్రా ’ ఆటల పోటీల ద్వారా గ్రామీణ ఆణిముత్యాలను వెలికి తీసి సానపట్టి వజ్రాలుగా మార్చి దేశానికి అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ’ఆడుదాం ఆంధ్రా’ను మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.

క్రీడాకారులకు  కిట్లను పంపిణీ చేశారు. ఇవాళ మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలు రాయిగా నిలుస్తాయని, 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వతేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో వీటిని నిర్వహిస్తామని చెప్పారు. అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

రెండు ప్రధాన లక్ష్యాలు.. 
‘ఆడుదాం.. ఆంధ్రా’ కార్యక్రమం వెనుక ప్రభుత్వానికి రెండు ప్రధాన ఉద్దేశాలున్నాయి. ఒకటి.. గ్రామ స్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడం. రెండోది.. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. ఇవి రెండూ సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వ్యాయామం, క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది? ప్రతి ఒక్కరికీ అవి ఎంత అవసరం? అనే విషయాలను తెలియజేసేందుకు ఇది ఒక అవగాహన కార్యక్రమంలా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతాం. టైప్‌ 2 డయాబెటీస్‌ని నిరోధించడంలో క్రీడలు చురుకైన పాత్ర పోషిస్తాయి.  

జబ్బుల బారిన పడకుండా.. 
మన ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామ స్థాయిలో ప్రివెంటివ్‌ కేర్‌పై దేశం మొత్తం గర్వపడేలా మన అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా మనిషికి వ్యాయామం ఎంత అవసరం అనే విషయాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

బీపీ ఎక్కువైతే గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయి. షుగర్‌ ఎక్కువైతే కిడ్నీ, నరాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల వీటిని కంట్రోల్‌లో ఉంచాలన్నా, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా గ్రామ స్థాయి నుంచి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అందుకే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.  

మెంటార్లుగా పీవీ సింధు, శ్రీకాంత్‌  
ఈ క్రీడోత్సవాలు సచివాలయం స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి. వివిధ స్థాయిల్లో ఆణిముత్యాలను గుర్తించేందుకు ప్రొఫెషనల్‌ లీగ్‌ టీమ్స్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయి. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను ఆణిముత్యాలుగా మలిచే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు టీమ్‌లు ముందుకొచ్చాయి. క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌   ముందుకు వచ్చాయి. వీరంతా నియోజకవర్గ స్థాయి నుంచి మన ఆటలను తిలకిస్తారు.

ఆణిముత్యాలను వెతికి వారికి మెరుగులు దిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈ టీమ్స్‌ తోడుగా ఉంటాయి. బ్యాడ్మింటన్‌కు సంబంధించి కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా వారిలో ఒకరికి విశాఖపట్నంలో, మరొకరికి తిరుపతిలో స్థలం ఇచ్చాం.

బ్యాడ్మింటన్‌ అకాడమీలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి సహకరిస్తుంది. శ్రీకాంత్, సింధు మెంటార్లుగా వ్యవహరిస్తూ ప్రతిభ ప్రదర్శించే మన పిల్లలకు తోడుగా నిలుస్తారు. ఇక వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ టాలెంట్‌ హంట్‌లో పాలు పంచుకుంటారు. 

ఇక ఏటా ఆటలు.. 
ఆడుదాం ఆంధ్ర టోర్నీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. గ్రామస్థాయి నుంచి మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు జరుగుతాయి. ఏటా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు గ్రామాల్లో ఆరోగ్యపరమైన అవగాహన కల్పిస్తూ టాలెంట్‌ హంట్‌ కొనసాగిస్తాం. తద్వారా మరిన్ని ఆణిముత్యాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వారికి నియోజకవర్గ స్థాయిలో ఆడేందుకు ప్రొఫెషనల్‌ కిట్లు పంపిణీ జరుగుతుంది. ఏటా కిట్లు ఇస్తూ మన పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.  

రాబోయే రోజుల్లో స్కూల్‌ స్థాయి నుంచి.. 
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి ప్రారంభిస్తే దాదాపు 34.19 లక్షల మంది క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర కోసం రిజిస్ట్రేషన్‌  చేసుకున్నారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేయడానికి ముందుకు వచ్చారు. మొత్తం 1.22 కోట్ల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువ క్రీడాకారులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. 15,000 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు గుర్తించి సిద్ధం చేశాం.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అన్నింటినీ గుర్తించి అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది. మీ అన్నగా అందరికీ ఆల్‌ ద వెరీ బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నా.  దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలని కోరుకుంటున్నా. 

పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు 
ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరి, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, కిలారు రోశయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement