ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో సెల్ ఫోన్... అరచేతుల్లో ప్రపంచాన్ని చూపిస్తూ మనిషిని కట్టిపడేస్తోంది. దీంతో ఏ కొద్ది తీరిక ఉన్నా జనం మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. కనీసమైన వ్యాయామాన్ని చేయడంలేదు.
ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. తద్వారా గ్రామీణ స్థాయిలోనే అనేకమందిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను బయట పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 15 సంవత్సరాల పిల్లల నుంచి ఆ పైన ఉన్న అన్ని వయసుల వారికీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నది ప్రభుత్వం. అన్ని గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ బిజీ జీవితానికి స్వస్తి చెప్పి ప్రస్తుతం ఆటల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏ విధమైన శారీరక శ్రమ, సరైన వ్యాయామం లేకుండా బీపీ, షుగర్ లాంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్న కోట్లాదిమందికి మరోసారి చిన్నప్పటి క్రీడానందాన్నీ, ఉత్సాహాన్నీ ఈ క్రీడలు కలిగిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో ప్రజలు మునిగి తేలుతూ ఉన్నారు. మునుముందు రోజుల్లో మరింతమంది క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ నుండి మరీ ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులను ప్రోత్సహించడానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి.
సుమారు 35 లక్షల మంది యువతీ యువ కులు ఈ క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వారందరి ఆటలనూ సుమారు 90 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించి సంతో షిస్తున్నారు. ఈ విధంగా క్రీడలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఈ క్రీడా ఉత్సవాలు కొనసాగడానికి ప్రజలు తమ వంతు అండదండలు అందించడం అవసరం. – నాగెండ్ల సుమతీ రత్నం, దాచేపల్లి
Comments
Please login to add a commentAdd a comment