సాక్షి, అమరావతి: పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతోపాటు కొత్తగా ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో దూసుకెళుతోంది. పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఏపీ భారీగా పెట్టుబడులను ఆకర్షించినట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. 2021 నుంచి 2023 ఏప్రిల్ వరకు 28 నెలల్లో రాష్ట్రంలో 108 యూనిట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.61,127 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ విడుదల చేసిన ఇండ్రస్టియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమోరాండం– ఇంప్లిమెంటేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2022లో కొత్తగా 46 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.45,217 కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 15 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.5,560 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో కుదిరిన రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ‘సాక్షి’కి వివరించారు. జీఐఎస్ ఒప్పందాల్లో రూ.1,35,362 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 111 యూనిట్లు ఆరు నెలల్లోనే అమలులోకి వచ్చాయని, డీపీఐఐటీ విడుదల చేసే తదుపరి గణాంకాల్లో ఇవి ప్రతిబింబిస్తాయని అధికారులు తెలిపారు.
జోరుగా పార్ట్ ఏ దరఖాస్తులు
గత 28 నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా రూ.32,697 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 121 సంస్థలు ‘ఐఈఎం పార్ట్ ఏ’ సమర్పించినట్లు డీపీఐఐటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుని డీపీఆర్ ఆమోదం, భూ కేటాయింపులు పూర్తై నిర్మాణ పనులు ప్రారంభించే యూనిట్లు పార్ట్ ఏ డీపీఐఐటీకి దరఖాస్తు చేస్తాయి.
జీఐఎస్ ఒప్పందాల్లో రూ.3.06 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు భూ కేటాయింపు దశల్లో ఉండగా ఇవి కూడా త్వరలో పార్ట్ ఏకు దరఖాస్తు చేసుకోనున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొత్తగా రూ.7,187 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పార్ట్ ఏ సమర్పించాయి. ఈ పెట్టుబడుల ప్రతిపాదనల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించనుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment