అదో విఫల గళం | Sakshi
Sakshi News home page

అదో విఫల గళం

Published Mon, Aug 21 2023 5:23 AM

Devineni Avinash Comment on Nara Lokesh and Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: నారా లోకేశ్‌ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా ప్రజలు జోకర్‌గానే భావిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త(విజయవాడ తూర్పు) దేవినేని అవినాశ్‌ వ్యాఖ్యానించారు.

ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ను రంగంలోకి దించారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ సైకోల్లా ప్రవర్తిస్తుండటం వల్లే వారిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో ఆ ముగ్గురూ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.   

ఆ ముగ్గురూ ద్రోహులే: వెలంపల్లి శ్రీనివాస్‌ 
అధికారంలో ఉండగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు, లోకేశ్‌ ద్రోహం చేశారు. టీడీపీ సర్కార్‌కు మద్దతిచ్చిన పవన్‌కళ్యాణ్‌ కూడా ద్రోహే. ఆ ముగ్గురూ కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం ధ్వంసం చేసిన ద్రోహులు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.

వాటిని పొందిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు టీడీపీ నేతలు కూడా స్పందించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్‌.. లోకేశ్‌ పాదయాత్రను బహిష్కరించారు. లోకేశ్‌ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము పవన్‌కు ఉందా? రాజకీయాల్లో జీరో అయిన పవన్‌ ఇప్పుడు సినిమాల్లో కూడా జీరో అయిపోయారు.

ఆ ముగ్గురూ సన్నాసులు కాబట్టే కలసి పోటీ చేసి జగన్‌ను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు.  విదేశీ విద్య పథకం ద్వారా ఆర్య వైశ్యుల పిల్లలను కూడా విదేశాలకు పంపిన ఘనత సీఎం జగన్‌ది.  పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తే రాష్ట్ర అవతరణ దినాన్ని జూన్‌ 2కు మార్చింది చంద్రబాబే. దాన్ని మళ్లీ మార్చి నవంబర్‌ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని సీఎం జగన్‌ నిర్వహిస్తున్నారు.   

బ్యారేజ్‌పై ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు: మల్లాది విష్ణు 
టీడీపీ హయాంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపి పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు లోకేశ్‌ పాదయాత్రను మేం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా? డబ్బులు, మద్యాన్ని పంచి పెయిడ్‌ వర్కర్లతో ప్రకాశం బ్యారేజ్‌పై ఈవెనింగ్‌ వాక్‌ చేసిన లోకేశ్‌ ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు.

విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లను దారి మళ్లించి ద్రోహం చేసింది చంద్రబాబే.  దొంగ టీడీఆర్‌ బాండ్లను తయారు చేసి అమ్మిన పార్టీ టీడీపీ. అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి లోకేశ్‌. బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టి గోవులకు నిలువ నీడ లేకుండా చేశారు. నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. మేం 11 అంశాలతో రూపొందించిన చార్జ్‌షిట్‌కు లోకేశ్, చంద్రబాబు సమాధానం చెప్పాలి.

జగనన్న కాలనీల ద్వారా విజయవాడలో 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎం జగన్‌ది. టీడీపీ పాలనలో వైశ్యులు, ముస్లింలు, బ్రాహ్మణులకు ఏం చేశారో లోకేశ్‌ చెప్పాలి. ఆర్‌–5 జోన్‌లో విజయవాడకు చెందిన 30 వేల మందికి సీఎం జగన్‌ ఇళ్ల పట్టాలిస్తుంటే వాటిని రద్దు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ ముగ్గురూ సైకోలే. విజయవాడ నగరం వైఎస్సార్‌సీపీ అడ్డా.  

ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా: దేవినేని అవినాశ్‌ 
పెయిడ్‌ వర్కర్లతో ఈవెనింగ్‌ వాక్‌ చేస్తున్న లోకేశ్‌కు 2014–19 మధ్య ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా? ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా ఊగిపోతున్నాడు. లోకేశ్‌ యాత్ర వల్ల చంద్రబాబు సీఎం కాలేరు. లోకేశ్‌ ఎమ్మెల్యే కాలేడు.  చంద్రబాబూ? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది.

గత నాలుగేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో విజయవాడ నగరం మౌలిక సదుపాయాల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైనింగ్‌ వాల్, ఫ్లైఓవర్‌లు వంటి అనేక నిర్మాణాలు పూర్తి చేశారు. పాదయాత్రలో లోకేశ్‌ వాటిని చూడాలి. టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను సింగపూర్‌ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే ఇప్పుడు సీఎం జగన్‌ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
Advertisement