సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా అసైన్డ్ భూముల బదలాయింపునకు మెరుగైన సిఫారసులు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేలను కోరారు. అసైన్డ్ భూములపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం చట్టాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరువిడతల భూ పంపిణీకి తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు భూమి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం అన్నివిధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. భూమి వ్యవసాయం, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి తమ చేతుల్లో ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి సైతం కలిగించేలా కమిటీ కృషిచేయాలని కోరారు.
గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందారులు పేదవర్గాల నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. అసైన్‌మెంట్‌దారులైన పేదవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ భూములకు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలు పరిశీలించాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. కమిటీ సభ్యురాలైన హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు.
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని నియమించడం గొప్ప పరిణామమన్నారు. ఈ సమావేశంలో తొలుత అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీసీఎల్‌ఏ, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కమిటీకి వివరించారు. అదనపు సీసీఎల్‌ఏ ఇంతియాజ్, సీసీఎల్‌ఏ ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి.గణేష్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment