నరసాపురం రూరల్ :పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో తరతమభేదాలు ఉండవని, ఏ రాజకీయ పార్టీ అయినా తమకు ఒక్కటేనని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. పోలీసుల మీదే దాడులు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దాతల సహకారంతో అధునాతన వసతులతో నరసాపురంలో నిర్మించిన డీఎస్పీ క్వార్టర్, కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ పార్టీలు తమ కేడర్‌ను నియంత్రించుకోవాలన్నారు. పోలీసులపై తిరుగుబాటు చేసి దాడిచేస్తే ఇక శాంతిభద్రతలను కాపాడటం ఎలా అని డీజీపీ ప్రశ్నించారు. అనుమతి తీసుకున్నచోట కాకుండా వేరే చోట సభను నిర్వహించుకుంటే పోలీసులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ సంఘటనలో 20 మందిని అరెస్టుచేశామని, బాధ్యులెవరినీ వదిలేదిలేదని ఆయన స్పష్టంచేశారు. అలాగే, సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న దుష్ప్రచారాలు, నేర ప్రవృత్తితో పెట్టే పోస్టులపై పోలీసు వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ సెల్‌ను ఏర్పాటుచేశామని డీజీపీ చెప్పారు. తప్పుడు ఆరోపణలు, ఉద్రేకపరిచే స్టేట్‌మెంట్‌లు ఇవ్వొద్దని డీజీపీ కోరారు.
గంజాయి సాగు వ్యవస్థను నేల రాసేశాం..
ఇక మూడు దశాబ్దాల నుంచి విశాఖ ప్రాంతంలో వేళ్లూనుకున్న గంజాయి సాగును నేల రాసేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. మొత్తం 7,500 ఎకరాల్లో గంజాయి సాగును తుదముట్టించామని తెలిపారు. ఆ సాగు చేసిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకుని జీవించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని డీజీపీ చెప్పారు. మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ సత్ఫలితాలిస్తోందన్నారు.
పోలీసులు, ఎస్‌ఐల నియామకానికి ఓకే..
పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 6,800 మంది పోలీసులు, 500 ఎస్సై పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని డీజీపీ చెప్పారు. ఎస్సై పోస్టులకు సంబంధించి ఆగస్టు మూడో వారంలో నియామకాలు జరిగే అవకాశముందని తెలిపారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment