సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సలో పారాసెటమాల్ 650 ఎంజీ వాడితే చాలని, అనవసర మందులు వాడొద్దని రాష్ట్ర కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ప్రేమ్‌కుమార్ తెలిపారు. అనేక దేశాలు, డబ్ల్యూహెచ్‌వో దీనినే నిర్ధారించాయని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స తదితర అంశాలపై డాక్టర్ ప్రేమ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..
ఒమిక్రాన్ బారిన పడిన వారు పారాసెటమాల్ మూడు పూటలా మూడు నుంచి ఐదు రోజులు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని తేమ ఆవిరి రూపంలో చర్మం నుంచి బయటికి వెళ్తుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా రోజుకు 2.5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు, మజ్జిగ, పళ్ల రసాలు తీసుకోవాలి. కొందరిలో ఐదు రోజుల తర్వాత దగ్గు ఉంటుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడే వారు బుడెసోనైడ్ ఇన్‌హేలర్‌ను 800 మైక్రో గ్రామ్స్ ఉదయం, రాత్రి 5 రోజులు పీల్చాలి. ఇప్పటికీ కొందరు విచ్చలవిడిగా ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింకోవిట్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. అవేమీ అవసరం లేదు. ఒమిక్రాన్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ కూడా పనిచేయదు.
హోమ్ ఐసోలేషన్ ప్రధానం
సామాజిక వ్యాప్తి దశకు ఒమిక్రాన్ చేరుకుంది. వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందువల్ల హోమ్ ఐసోలేషన్ ముఖ్యం. పాజిటివ్ అయిన వారు వారం రోజులు ఇంట్లోనే ఉండాలి. రోగికి ఇంట్లో ఇతరులు ఎదురుపడాల్సి వస్తే ఇరువురు ఎన్–95 మాస్క్ లేదా డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు మూడు రోజులు దాటి తీవ్రంగా ఉన్నా, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, కళ్లు తిరిగిపడటం, మగత వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి.
ఒకే ప్రభావం ఉండదు
ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఒకే లక్షణాలు ఉంటున్నాయి. ప్రభావం మాత్రం అందరిపైనా ఒకేలా లేదు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కీళ్ల నొప్పులు, ఇతర రోగాలకు స్టెరాయిడ్స్ వాడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిపై ప్రభావం ఎక్కువే. యువత, ఆరోగ్యవంతుల్లో ఏమీ కాదన్న ధీమా ఎక్కువగా ఉంది. వీరికి ఏమీ అవ్వకపోవచ్చు. జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే ఇళ్లలో, చుట్టుపక్కల ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment