ఏది నిజం?: ‘ఈనాడు’ దిగజారుడు రాతలు | Eenadu Chandrababu Gang Politics On Housing Lands To Poor People | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ‘ఈనాడు’ దిగజారుడు రాతలు

Published Mon, May 15 2023 4:33 AM | Last Updated on Mon, May 15 2023 2:28 PM

Eenadu Chandrababu Gang Politics On Housing Lands To Poor People - Sakshi

‘మేం ఉండే చోట పేదలుండటానికి వీల్లేదు!.వాళ్లకు ఇక్కడ స్థలాలిస్తే ‘సామాజిక తూకం’ దెబ్బతింటుంది’’ అంటూ న్యాయస్థానాలకు వెళ్లి ఓడిపోయిన వారికి ఇంకా కొమ్ముకాస్తున్నారు చంద్రబాబు నాయుడు! 

కోర్టు తీర్పును అమలు చేయొద్దంటూ ఆందోళనలు చేసి... శాంతిభద్రతల సమస్యలు సృష్టించబోయిన వారిని పోరాట యోధులుగా పతాక శీర్షికలకెక్కిస్తున్నారు బాబు రాజకీయ గురువు రామోజీరావు!!. 

పేదలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి... ఓడిపోయాక కూడా వారి సొంతింటి కలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి వీళ్లని? చేతిలో నాలుగు టీవీ ఛానెళ్లు, మూడు పత్రికలు ఉన్నాయి కదా అని ఎంతకైనా తెగిస్తారా? తమకు ఏమనిపిస్తే అది రాస్తూ... యావత్తు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారా? ముసుగులేసుకుని మద్దతిచ్చే పార్టీలు, నాయకులు ఉన్నారు కదా అని ఎలాంటి ప్రచారమైనా చేస్తారా? 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదన్నది చంద్రబాబు నాయుడి విధానం. అందుకే... ఎక్కడికక్కడ ఆయా స్థలాలు కేటాయించవద్దంటూ కోర్టుల్లో కేసులు వేయించారు. చివరికి ఇళ్ల స్థలాలన్నీ మహిళల పేరిట ఇవ్వటం కూడా తప్పని న్యాయ పోరాటం చేశాడు. అలా చేసి... తనకు అనుకూలంగా తీర్పు రప్పించుకుని... కొన్నాళ్ల పాటు పేదలకు ఇళ్ల  స్థలాల కేటాయింపులను, నిర్మాణాలను ఆపగలిగారు కూడా!. చివరకు అవ్వాతాతల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై కూడా విషం చిమ్మారు.

పేదలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవటాన్ని కూడా వ్యతిరేకించారు చంద్రబాబు. దీన్ని వ్యతిరేకిస్తూ కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కార్పొరేట్‌ మాఫియా తరఫున సుప్రీంకోర్టు వరకూ పోరాటం సాగించారు. చివరికి ఓడిపోయినా... కొన్నాళ్లపాటు మాత్రం ఆపగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం తెగ అప్పులు చేస్తోందని పదేపదే తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయిస్తూనే... రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు చేసిన ప్రతి ప్రయత్నానికీ అడ్డు తగిలారు చంద్రబాబు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల వేలం నుంచి మొదలుపెడితే ప్రతిచోటా న్యాయపరమైన అడ్డంకులే!. న్యాయ ప్రక్రియపై తనకున్న ‘పట్టు’తో చాలా కేసులో అనుకూల తీర్పులూ రాబట్టుకోగలిగారు!. 

దేశవ్యాప్తంగా మూడు బల్క్‌డ్రగ్‌ పార్కులకు కేంద్రం అనుమతివ్వగా... తెలంగాణ సహా అందరితోనూ పోటీ పడి మరీ... ఒకదాన్ని రాష్ట్రం దక్కించు
కుంది. కానీ ఈ పార్కు రాష్ట్రానికి కేటాయించవద్దంటూ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడి చేత నేరుగా కేంద్రానికే లేఖ రాయించారు చంద్రబాబు!!. ఇక్కడేమో రాష్ట్రానికి ప్రాజెక్టులు రావటం లేదని తన మీడియాతో ప్రచారం చేయిస్తూనే ఉన్నారు!!.  

మూలపేట పోర్టు (గతంలో భావనపాడు) నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ ఎవరో ఒకరితో భూములకు సంబంధించో, పర్యావరణానికి సంబంధించో కేసులు వేయిస్తూనే వచ్చారు చంద్రబాబు. ఆయన లక్ష్యమల్లా ఒక్కటే. ఈ ప్రభుత్వ హయాంలో ఏ పనీ కాకూడదు. రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ మంచి జరక్కూడదు.  

అంతెందుకు!!. పరిపాలన వికేంద్రీకరణ విషయంలోనూ అదే కథ!. అమరావతిలోనే అన్నీ ఉండాలి తప్ప... వేరెక్కడా ఎలాంటి అభివృద్ధీ జరగకూడదనే దారుణమైన కుతంత్రంతో... రైతుల పేరిట అమరావతిలో ఉద్యమాలు, యాత్ర­లు, న్యాయపోరాటాలు... ఒకటా రెండా!!. చివరకు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే సామాజిక తూకం దెబ్బతింటుందంటూ కోర్టులకెక్కారు చంద్రబాబు మనుషులు. అసలు అన్ని వర్గాల ప్రజలూ ఉంటేనే కదా రాజధాని? కొందరికే పరిమితమైతే అదో గేటెడ్‌ కమ్యూనిటీ అవుతుంది తప్ప రాష్ట్ర రాజధాని ఎలా అవుతుంది?  

వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి... ఏపీలో అందరినీ డైవర్ట్‌ చెయ్యడానికి చంద్రబాబు ఆరంభించిన మహా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ అది!. బలహీన సామాజికవర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డవారు ప్రవేశించడానికి వీల్లేని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులా దాన్ని తీర్చిదిద్దాలనుకున్నారు బాబు. పేద సామాజిక వర్గాలు, కులాల వారు అక్కడకు పనివాళ్లుగా ఉదయం వచ్చి, సాయంత్రం వెళ్లిపోవాలే తప్ప, హక్కుదారులుగా, వాటాదారులుగా నివాసం ఉండే అవకాశం వాళ్లకి  ఇవ్వకూడదనుకున్నారు.  

కానీ ఇక్కడే 50వేల మందికి ఇళ్ల స్థలాలు, వాటిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న డిజైన్‌తో చంద్రబాబు కట్టాలని భావించిన సామాజిక కోటను బద్దలుకొట్టేశారు ముఖ్యమంత్రి జగన్‌. దాన్ని అందరి రాజధానిగా మార్చాలని భావించారు. కోర్టు ద్వారా చంద్రబాబు కొన్నాళ్లు అడ్డుకున్నా... అంతిమంగా న్యాయమే గెలిచింది. రాజధాని అందరిదీ అని న్యాయస్థానం చెప్పకనే చెప్పింది. అక్కడితో ఆగిపోవాల్సి ఉన్నా... చంద్రబాబు ఆగటం లేదు. తన అనుకూల వర్గాల చేత అక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయిస్తూ శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.

పోలీసులు అడ్డుకుంటే... తన అనుకూల మీడియాతో దుర్మార్గపు వార్తలు రాయిస్తున్నారు. అయినా పేదలకు ఇళ్లు వద్దంటూ ఆందోళనలు చేసేవారిని పతాక శీర్షికల్లోకి ఎక్కించి మరీ రెచ్చగొడుతున్న ‘ఈనాడు’ పత్రికను ఏమనుకోవాలి? రామోజీరావుకు అసలు బుద్ధుందా? పేదలకు భూములివ్వాలని గతంలో పోరాటాలు చేసిన పార్టీలు కూడా ఇపుడు చంద్రబాబు నాయుడితో చేతులు కలిపి, పేదలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయంటే... వీళ్లందరికీ పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో అర్థం కావటం లేదా? 

అసలెందుకు ఈ ఆర్‌5 జోన్‌? 
చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)లో పేదలు ఉండే అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు. వాస్తవానికి పూలింగ్‌ నిమిత్తం సేకరించిన భూమిలో 5 శాతాన్ని పేదలకు ఇవ్వాలని సీఆర్‌డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా... చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. పైపెచ్చు దీనికి గండికొట్టడానికి... సీఆర్‌డీఏ పరిధిలో ఏ ప్లాటుకైనా కనీసం 120 చదరపు గజాలు తప్పనిసరి అని, ఆ మాత్రం లేకుంటే ఎలాంటి నిర్మాణాలకూ ప్రభుత్వం అనుమతివ్వకూడదనే నిబంధనను తెచ్చారు.  

అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం... గుంటూరు, ఎన్టీయార్‌ జిల్లాల్లోని పేదలకు సైతం ఇళ్ల స్థలాలివ్వాలని సంకల్పించి... ఈ 120 గజాల నిబంధనను సవరించింది. దీనికోసం సదరు నిబంధన వర్తించని విధంగా ఆర్‌–5 జోన్‌ను ఏర్పాటు చేసి.. దానికి అనుగుణంగా సీఆర్‌డీఏ పరిధిలో 1402.58 ఎకరాలు కేటా­యించి 50,004 మందికి ఇంటి స్థలాలిచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

న్యాయపోరాటాల వల్ల ప్రక్రియ ఆగిపోగా... తాజా­గా అడ్డంకులన్నీ తొలగటంతో... పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని కూడా అడ్డుకునేందుకు మళ్లీ రైతుల ముసుగులో ఆందోళన మొదలుపెట్టించారు చంద్రబాబు. అక్కడి­తో ఆగలేదు కూడా. గతంలో వారికి స్థలాలివ్వవద్దని చెప్పిన వీరంతా.... ఇపుడు వీళ్లకు వేరేచోట ఇవ్వండంటూ మళ్లీ న్యాయస్థానాలకు వెళ్లే దుస్సాహసానికి దిగుతున్నారంటే చంద్రబాబు కుయుక్తులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తున్నా... 
అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తున్నా తెలుగుదేశం మాత్రం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 22 వేల మంది రైతులకు గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. గతేడాది కూడా జూన్‌ నెలలో రూ.194 కోట్లను కౌలుగా చెల్లించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ పరిధిలో ఉన్న భూములకు మాత్రం (కేటగిరీ 4,5,6) కౌలు చెల్లించడం లేదు.

సీఆర్డీఏకు ఇచ్చిన భూముల్లో సుమారు 2900 ఎకరాలపై యాజమాన్య హక్కుల విషయంలో కేసులు నమోదవడంతో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీటిలో కేసులు తేలినవాటికి ఎప్పటికప్పుడు కౌలు చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా మే, జూన్‌ నెలల్లో కౌలు చెల్లింపు చేస్తున్నారు. అయినా రైతుల ముసుగులో టీడీపీ ఆందోళనలకు దిగటం... ‘ఈనాడు’, దాని తోకలు ఈ ఆందోళనను చిలవలు పలవలు చేసి దుష్ప్రచారం చేయటం... ఇదంతా ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమే. 

అసలైన వికేంద్రీకరణ అంటే ఇదీ... 
తాను నిర్మించే రాజధానిలో పేదలకు నివసించే హక్కు లేకుండా చేశారు చంద్రబాబు. కానీ పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం... అమరావతితో పాటు అటు విశాఖలోను, ఇటు కర్నూలులో కూడా భారీ ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలిచ్చారు. విశాఖ, కర్నూలుల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా చాలావరకూ వివిధ దశల్లో ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల్లో... మొత్తంగా రాజకీయ నియామకాల్లో యాభై శాతం వాటా ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని... రాజధాని ప్రాంతాన్ని తన వర్గీయుల గేటెడ్‌ కమ్యూనిటీగా మార్చేయాలనుకున్న చంద్రబాబుతో పోల్చగలమా? అసలు రాష్ట్రంలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వటం... వారికి ఇళ్లు నిర్మించుకోవటంలో సహకరించటం చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడైనా చూశామా? స్వాతంత్య్రంవచ్చి 75 ఏళ్లుగడిచినా.. పేదలకు ఇళ్లు లేని పరిస్థితి ఉందంటే సిగ్గు పడాల్సిన అవసరం లేదా?

అలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న పార్టీని ఏమనాలి? మీడియా ముసుగులో ఆ పార్టీకి కొమ్ము కాస్తూ.. పేదల సొంతింటి కలకు అడ్డుపడుతున్న రామోజీరావును, ఆయన తోక మీడియాను ఏమనాలి? ఫిలిం సిటీ పేరిట కోటల్లాంటి సౌధాలు కట్టుకుని కూడా పేదల ఇళ్లకు అడ్డుపడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని ఏం చేయాలి? రాజధాని ప్రాంతంలో పేదలకు స్థలాలిస్తే ముంబైలోని ధారవి లాంటి మురికి వాడలు తయారవుతాయని వాదించటం దుర్మార్గం కాదా? పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలిస్తే డెమెగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వస్తుందని వాదించటం ఒకరకమైన అంటరాని తనం కాదా? కులవివక్షకు పరాకాష్ట కాదా? ఎన్ని మొట్టికాయలు పడినా ఇంకా వారు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్నారంటే.. ఇంతకన్నా దారుణం ఏముంది?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement