Eenadu Fake News On Andhra Pradesh Government Insurance - Sakshi
Sakshi News home page

Fact Check: బాండ్లు లేకున్నా బీమాకు అర్హులే.. ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తించేలా ‘ఈనాడు’ తప్పుడు కథనం

Published Tue, Dec 20 2022 3:58 AM | Last Updated on Tue, Dec 20 2022 9:37 AM

Eenadu Fake News On Andhra Pradesh Government Insurance - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా కార్యక్రమంపై ఈనాడు దుర్బుద్ధితో అసత్య కథనాలను ప్రచురించింది. ‘దక్కని భరోసా’ శీర్షికతో సోమవారం ఎల్లో మీడియా ప్రచురించిన కథనంలో ఏమాత్రం నిజం లేదు.   

‘ఈనాడు’ ఆరోపణ
గ్రామ, వార్డు సచివాలయాల్లోని 80 వేల మంది ఉద్యోగుల నుంచి ప్రతి నెలా రూ.6.80 కోట్ల సొమ్మును గ్రూపు ఇన్సూరెన్స్‌ ప్రీమియంగా తీసుకుంటున్న ప్రభుత్వం వారికి బాండ్లను మాత్రం జారీ చేయలేదు. అనుకోని ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

వాస్తవం:  ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి ప్రీమియాన్ని మినహాయించి చెల్లించిన నాటి నుంచి ఆ ఉద్యోగులందరికీ బీమా వర్తిస్తుంది. బీమా చట్టం 1938 సెక్షన్‌ 64 (వి)(బి) అధికారికంగా బాండ్‌ జారీ చేసే వరకూ జీతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రమే బాండ్‌గా పని చేస్తుందని స్పష్టం చేస్తోంది. ఈ నిబంధన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుందని సచివాలయ శాఖ పేర్కొంది.  

‘ఈనాడు’ ఆరోపణ
ఒక్కో ఉద్యోగి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు రూ.850 చొప్పున మినహాయించుకుంటున్నారు.  

వాస్తవం: ఈ ఏడాది జూన్‌ 25న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 5  ప్రకారం 1,00,724 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు పూర్తయింది. ఈ ఉద్యోగులందరికీ జీతం నుంచి ప్రీమియం మినహాయించి ఏపీజీఎల్‌ఐకి చెల్లిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 18న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో 198 ప్రకారం నెలవారీ ప్రీమియం రూ.500 నుంచి రూ.800కి  పెరిగింది.   

‘ఈనాడు’ ఆరోపణ
గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తీసుకుంటున్న నాటి నుంచి ఐదు నెలల వ్యవధిలో పది మంది ఉద్యోగులు మృతి చెందారు. తాము ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదని బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు.  

వాస్తవం: ఈ మధ్య కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన 8 మంది ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించినట్లు అధికారులు గుర్తించారు. ప్రీమియం చెల్లించే ఉద్యోగులలో ఎవరైనా చనిపోయినా, బాండ్లు జారీ కాకపోయినా సంబంధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం బీమా పరిహారం చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వ జీవిత బీమా శాఖ (ఏపీజీఎల్‌ఐ) డైరెక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

ఉద్యోగుల జీతం నుంచి ప్రీమియం మినహాయించి చెల్లించిన నాటి నుంచి ఆ ఉద్యోగులందరికీ బీమా వర్తిస్తుందని గతంలోనే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొనడంతో పాటు బాండ్లు లేవన్న కారణంగా దరఖాస్తులను నిరాకరించరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి బీమా పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే బాండ్లు లేకపోయినా జిల్లాలో సంబంధిత విభాగాల అధికారులు స్వీకరిస్తున్నారని తెలిపారు.  

‘ఈనాడు’ ఆరోపణ
సచివాలయాల శాఖ అధికారులను సంప్రదిస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు.  

వాస్తవం: బాండ్లు లేకపోయినా ఇప్పటికే చనిపోయిన వారికి నిబంధనల ప్రకారం బీమా పరిహారం అందజేసే అంశంలో ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రీమియం చెల్లిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బీమా పాలసీ బాండ్లు జారీ చేయాలని ఏపీజీఎల్‌ఐ డైరెక్టర్‌కు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ కార్యాలయం నవంబరు 1వ తేదీనే లేఖ రాసింది.

దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి ప్రత్యక్ష పద్ధతిలో బాండ్ల జారీ కంటే అందరికీ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా డిజిటల్‌ బీమా బాండ్ల జారీకి ప్రభుత్వ బీమా శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి చర్యలు 
చేపట్టింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement