ఇళ్లపై కుళ్లు రాతలు! | Eenadu Ramojirao Fake News On Houses in Jagananna Colonies | Sakshi
Sakshi News home page

ఇళ్లపై కుళ్లు రాతలు!

Published Tue, Jun 21 2022 2:33 AM | Last Updated on Tue, Jun 21 2022 9:16 AM

Eenadu Ramojirao Fake News On Houses in Jagananna Colonies - Sakshi

మొన్న ఐదేళ్లు. అంతకు ముందో ఎనిమిదేళ్లు. ఇన్నాళ్లు పాలించడాన్ని చంద్రబాబు నాయుడు రికార్డుగా చెబుతుంటారు. రామోజీరావు దాన్నో అద్భుతంలా ప్రశంసిస్తారు. బాబు ఆ కాలంలో ఏమీ చేయకున్నా సరే!! అదంతా గుప్తుల స్వర్ణయుగం మాదిరే చూపించాలని తాపత్రయపడుతుంటారు. మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలోపే ఏకంగా 30.76 లక్షల కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తున్నారు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి. దీనికోసం ఏకంగా రాష్ట ప్రభుత్వం తరఫున 1,05,886 కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా రామోజీకి నచ్చటం లేదు. 

ఇళ్లు కట్టుకోవటానికి కేంద్రమే 1.8 లక్షలిస్తోందని... రాష్ట్రమేమీ చేయట్లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ బాబు హయాంలో ఎన్నిళ్లు ఇచ్చారో ఎన్నడూ అడగరు. ఎందుకిన్ని ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించరు. అసలిన్నాళ్ల తరవాత కూడా 30.76 లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాల్సిన దయనీయ పరిస్థితులున్నాయనే వాస్తవం వయసు మీరిన ఆయన కళ్లకు ఆనదు. మరీ ఇంత దారుణమైన రాతలా రామోజీరావుగారూ? రాష్ట్ర  ప్రభుత్వం ఈ ఇళ్లకు ఏం చేస్తోందో మీకు కనిపించటం లేదా? లేక మీరు చూడాలనుకోవటం లేదా? అసలు పనిగట్టుకుని ‘ఈనాడు’ రాస్తున్న రాతల్లో నిజమెంత!. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్లకోసం ఏం చేస్తోంది? ఎంత వెచ్చిస్తోంది? ఏది నిజం?... ఒకసారి చూద్దాం...

అసలు 30.76 లక్షల మంది సొంతింటి కలను నిజం చేయటం కోసం భారీ లే ఔట్లు వేస్తుండటంతో ఏకంగా ఊళ్లే పుట్టుకొస్తున్న చరిత్ర దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.56,102 కోట్ల విలువైన భూములు కేటాయించింది. ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.36,026 కోట్లు వెచ్చిస్తోంది. ఇసుకను ఉచితంగా ఇవ్వటమే కాక ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందిస్తోంది. ఇన్ని చేసినా కొందరి ఇళ్లకు ఇంకా నిధులు కావాల్సి రావటంతో... వారికి రూ.35 వేల వరకూ బ్యాంకు రుణాన్ని పావలా వడ్డీకే ఇప్పిస్తోంది.

వారిపై వడ్డీ భారం పడకుండా మిగిలిన వడ్డీని తనే చెల్లిస్తోంది. అయితే ఇన్ని ప్రత్యామ్నాయాలున్నప్పటికీ కొందరికి ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదు. అలాంటివారికి ఆప్షన్‌–3 కింద తనే ఇళ్లు పూర్తిగా నిర్మించి ఇస్తోంది. అలా ఇప్పటికి 3.27 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తోంది. ఇదీ... రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇదంతా కేంద్రం చెల్లిస్తున్న 1.8 లక్షలకు అదనంగా..!!. చూస్తున్నారా రామోజీరావు గారూ!! ‘‘నాకు రూ.11 లక్షల విలువైన ఇంటి స్థలంతో పాటు ఉచితంగా 20 టన్నుల ఇసుక, 90 బస్తాలు సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది’’ అంటున్న విశాఖ వాసి జి.అప్పల నారాయణమ్మకు జవాబు చెప్పే ధైర్యం మీకుందా? మీకోసం ఇవిగో... మీరు చెప్పని నిజాలు...

ఈనాడు ఆరోపణ
జగనన్న కాలనీల్లో స్థలం ఇస్తున్నారు. కట్టుకోవడానికి రూ.1.8 లక్షలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. నిజానికి ఇది కేంద్రం ఇచ్చే సాయం.

నిజం 
ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలే ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇంటి పట్టా విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 30.76 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.56,102 కోట్లు. ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా జగనన్న కాలనీల్లో భూమిని చదును చేయడంతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.36,026 కోట్లు వ్యయం చేస్తోంది.

 ఈనాడు ఆరోపణ 
అరకొరగా సామగ్రి పంపిణీ. ఆశించిన మేర లబ్ధిదారులకు అందించడం లేదు.

నిజం 

లబ్ధిదారులకు సమీప గిడ్డంగుల వద్దే సామగ్రి అందచేస్తున్నారు. గత ఐదేళ్లలో 2.12 లక్షల టన్నుల సిమెంట్‌ ఇచ్చారు. వాటితో పోల్చితే గత సంవత్సరంలో ఇచ్చిన సిమెంట్‌ మూడు రెట్లు ఎక్కువ.

ఈనాడు ఆరోపణ 
ఇల్లు కట్టుకునేందుకు రూ.ఐదారు లక్షలు అవుతుంది. అత్యంత సాధారణ ఇల్లు అయితే రూ.మూడు లక్షలు అవుతుంది.

నిజం 
ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మాత్రమే కాకుండా రూ.15,000 విలువైన ఇసుక, సామగ్రిలో ధరల వ్యత్యాసంతో రూ.45,000 మేర ప్రయోజనం, పావలా వడ్డీ ద్వారా రూ.35 వేల దాకా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి చేకూర్చిన ప్రయోజనం రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి స్థలం విలువ, మౌలిక వసతుల కోసం వెచ్చిస్తున్నది అదనం.

ఈనాడు ఆరోపణ 
అది కేంద్ర సాయమే

నిజం 
కేంద్ర సాయాన్ని మినహాయిస్తే... ఇళ్ల స్థలాలు, ఇసుక, రాష్ట్ర ప్రభుత్వ వాటా, పావలా వడ్డీ, కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్‌ సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,05,886 కోట్లను వ్యయం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ చేయనంత ఖర్చు ఇది. పేదలకు ఎలాగైనా సొంతిల్లు ఇవ్వాలన్న వై.ఎస్‌.జగన్‌ బలమైన సంకల్పానికి ఫలితమిది. ఈ స్థాయిలో వెచ్చిస్తున్నా కళ్లు మూసుకుని, తానేమీ చూడటం లేదు కాబట్టి అక్కడేమీ జరగటం లేదన్న తీరులో వ్యవహరిస్తోంది ‘ఈనాడు’. అదే దురుద్దేశంతో కుట్రపూరిత కథనాలు వండి వారుస్తోంది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ బరితెగింపు?

వాస్తవాలు తెలిసినా..
భారీ గృహ నిర్మాణ బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రభుత్వం... తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేదలకిచ్చిన ఇంటి స్థలం విలువ గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండగా పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఉంటోంది. రానురాను ఈ విలువ ఇంకా పెరుగుతూ వస్తోంది. ఈ పనే గనక చంద్రబాబు చేసి ఉంటే ‘ఈనాడు’ ఆయన్ను ఆకాశానికెత్తేసి ఇప్పటికీ కిందకు దించేది కాదు. కానీ చేసింది జగన్‌మోహన్‌ రెడ్డి. కాబట్టి ఏదో ఒకరకంగా దుష్ప్రచారం చేస్తూ ఆయనకొస్తున్న ఆదరణను తగ్గించటమే రామోజీ పన్నాగం. అసలు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఓ పేదవాడి ఇల్లున్న లే అవుట్‌కి కనీసం కరెంట్‌ వైర్‌ లాగిన సందర్భాలున్నాయా? ఇప్పుడు 2,563 జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులు ప్రారంభం కావడం నిజం కాదా? గతంలో ఏ ప్రభుత్వమైనా ఇల్లు కట్టుకునేందుకు స్టీలు సమకూర్చిందా? ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 67 వేల టన్నులు స్టీలు ఇవ్వటం నిజం కాదా? చెప్పండి రామోజీరావు గారూ?

పొంతన ఉందా?
కోవిడ్‌ కారణంగా గతేడాది నాలుగు నెలల పాటు ఇళ్ల పనులు మందగించాయి. ఈర్షా్య ద్వేషాలతో న్యాయస్థానాల్లో దాఖలు చేసిన కేసులతో మరో మూడు నెలలు నష్టపోవాల్సి వచ్చింది. ఇన్ని అవాంతరాలు సృష్టించినా ఇప్పటివరకు 67 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. తొలిదశలో చేపట్టిన గృహ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలు పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున సాయం అందుకున్నారు. ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చు గురించి ఒకచోట రూ.2.25 లక్షలు అని, అతి సాధారణంగా నిర్మించుకుంటే రూ.3 లక్షలు అని, అదే జిల్లాలవారీగా అయితే రూ.ఐదారు లక్షలు అని రామోజీ రాసుకొచ్చారు. నిజమే.. రామోజీ ఇంటికి, పేదవాడి ఇంటికీ పొంతన ఉంటుందా? మార్బుల్‌ ఫ్లోర్, ఎయిర్‌ కండిషన్‌తో కూడిన రామోజీ విలాసవంతమైన భవనాన్ని ఓ పేదవాడు నిర్మించుకునే ఇంటితో ఎలా పోల్చగలం? 

జగనన్న రూ.6 లక్షల ఆస్తిచ్చారు
మేం ముగ్గు అమ్ముకుంటూ, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరిస్తూ జీవనం సాగిస్తాం. దుర్భర దారిద్య్రంలో ఉన్న మా కుటుంబానికి సుమారు రూ.6 లక్షల విలువైన స్థలాన్ని ఎలాంటి పైరవీలు లేకుండా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సాయం అందించారు. డ్వాక్రా ద్వారా సున్నా వడ్డీకి రూ.50 వేలు, సుమారు రూ.30 వేలు విలువ చేసే నాలుగు లారీల ఇసుకను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. రాయితీపై సిమెంట్, ఐరన్‌ తదితర సామగ్రిని సమకూర్చారు. కాలనీకి తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. 
– ముదరగడ దానమ్మ, ఆలమూరు మండలం, ఎర్రకాలనీ, కోనసీమ జిల్లా 

రూ.11 లక్షల ఇంటి స్థలం ఇచ్చారు
ప్రభుత్వం నాకు ఇటీవల 72 గజాల స్థలాన్ని కేటాయించి పట్టా (ప్లాట్‌ నెంబర్‌ 201) అందించింది. ప్రస్తుతం ఇక్కడ గజం విలువ రూ.15 వేలు ఉంది. దీని ప్రకారం స్థలం విలువ దాదాపు రూ.11 లక్షలు ఉంటుంది. ఇంటి నిర్మాణం కోసం 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. రూ.1,18,765 బిల్లు మంజూరు చేసి 90 బస్తాలు సిమెంట్‌ ఇచ్చారు. ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో తలదాచుకున్న మేం జగన్‌ బాబు దయతో కష్టం లేకుండా సొంతిల్లు కట్టుకోగలుగుతున్నాం. టీడీపీ ప్రభుత్వం మాలాంటి పేదలకు నీడ కల్పించలేకపోయింది.     
– జి.అప్పల నారాయణమ్మ– వెల్లంకి, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా

విలువైన స్థలం ఉచితంగా..
అద్దె ఇంటికి ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఏళ్ల తరబడి చెల్లించాం. ప్రభుత్వం మాకు రాప్తాడు సమీపంలోని జగనన్న లేఅవుట్‌లో ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇక్కడ సెంటు స్థలం దాదాపు రూ.3 లక్షలు ఉంది. విలువైన స్థలాన్ని ప్రభుత్వంమాకు ఉచితంగా ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.90 వేలు బిల్లు చెల్లించడంతోపాటు ఇసుక, సిమెంట్, స్టీల్, ఇటుకలు అందించారు. 
– దివానం రుద్రమ్మ, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement