
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కోలో నకిలీ లేఖ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ ఆదేశాల ప్రతులు నిజం కాదని, అదంతా తప్పుడు ప్రచారమని ట్రాన్స్‌కో అదనపు కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోమని చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు తాను రాసినట్లుగా చక్కర్లు కొడుతున్న లేఖ అబద్ధమని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కోకి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు ట్రాన్స్‌కో, ఇతర విద్యుత్ సంస్థల అధికారిక వెబ్‌సైట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటన ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఛీటింగ్ ‘మార్గం' మూత!