సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని చోట్ల తేలికపాటి, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇవి కొనసాగనున్నాయి. ఈనెల 26 నుంచి వానలు మరింత జోరందుకోనున్నాయి. అప్పటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి.
ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వానలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment