సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదికపై ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే..
మీరు గృహ ప్రవేశానికి రావాలి జగనన్నా..
అన్నా నాది పేద కుటుంబం, మేం రైల్వే పోరంబోకు స్ధలంలో ఇల్లు వేసుకుని ఉంటున్నాం. మాలాగే 750 కుటుంబాలు ఉన్నాయి, రైల్వే వారు నోటీసులు ఇచ్చారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎండకు ఎండి వానకు తడిశాం. నాకు ఇంటి స్ధలం వచ్చిందని చాలా ఆనందపడ్డాం. గజం భూమి కూడా కొనుక్కోలేని మాకు గుంటూరు-విజయవాడ మధ్యలో లక్షల విలువైన భూమిని ఇస్తున్నారు. మీరు లక్షల మందికి పట్టాలివ్వడమే కాదు వారిని ఆస్తిపరులను చేశారు.
కుట్రలు, రాజకీయంతో మాకు రాకుండా చేశారు.పేదలు ఉంటే స్లమ్ లుగా మారుతాయన్నారు. అవన్నీ మీరు ధీటుగా ఎదుర్కొన్నారు. మాకు ఇది గొప్ప పండుగ. మీ మధ్యలో ఈ పండుగ చేసుకుంటున్నాం. నవులూరులో నాకు వచ్చిన స్ధలం చూడగానే సంతోషమేసింది. అక్కడ ఉన్న ఏర్పాట్లు చాలా బావున్నాయి. నేను ఇల్లు కట్టగానే మీరు గృహ ప్రవేశానికి రావాలని కోరుతున్నాను. మా పేదలకు మీరు తోడుగా ఉన్నారు. మీ చెరగని చిరునవ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. దుష్టశక్తులకు తగిన బుద్దిచెబుతాం. మా మహిళలంతా మీ వెంటే నడుస్తామని చెబుతున్నాను, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నాను.
-గొట్టిముక్కల హైమావతి, లబ్ధిదారు, తాడేపల్లి మున్సిపాలిటీ
ఆ యాగ ఫలితమే ఈ పండుగ..
అన్నా, నేను ఒక బీసీ వర్గానికి చెందిన మధ్యతరగతి మహిళను, నాకు వివాహం అయి 25 ఏళ్లు అయింది. నా భర్త హోటల్లో పనిచేస్తారు. నాకు ముగ్గురు పిల్లలు. నాకు వివాహం అయిన కొత్తలో ఎదుర్కున్న సమస్యను చెప్పాలనుకున్నాను. మా అత్తగారి అమ్మ చనిపోతే ఆ అద్దె ఇంటి యజమాని శవాన్ని ఉంచనీయలేదు, అప్పుడు చాలా క్షోభను అనుభవించాను. అద్దె పెరిగినప్పుడల్లా ఇల్లు మారుతూ జీవనం కొనసాగించాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. మేం నమ్మి దరఖాస్తు చేశాం.
మీరు పేదలకు ఇళ్లు అనే మహాయాగం ప్రారంభిస్తే ప్రతిపక్ష నాయకులు మారీచుడిలా అడ్డపడినా మీరు శ్రీరాముడిలా జయించి, వారిని ఎదిరించి మాకు యాగఫలం అందించారు. ఆ యాగ ఫలితమే ఈ పండుగ. నాతో పాటు యాభై వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. ఏ అన్నైనా పుట్టింటికి వెళితే ఒక చీర పెడతారు లేక ఒకరోజు భోజనం పెడతారు కానీ ఏ అన్నైనా ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పట్టాల పంపిణీకి ఆహ్వనించి మీ సొంతింటి కల సాకారం చేసుకోమనే అన్న ఎవరైనా ఉన్నారా. అలాంటి అన్న నాకు ఉన్నారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నాకు ముగ్గురు పిల్లలు, వారిని బాగా చదివించడం కత్తి మీద సాము. నా పెద్దపాప పీజీ చదువుతుంది. చిన్నపాప బీటెక్ చదువుతుంది. విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా నేను చదివించగలుగుతున్నాను. మీరు అమ్మలా ఆదరిస్తున్నారు. నాన్నలా మా భారం మోస్తున్నారు. అన్నలా మీ అనురాగం పంచుతున్నారు. మీ చల్లని నీడలో మేం సుస్ధిరంగా ఉండాలనుకుంటున్నాం. మాకు కేటాయించిన స్ధలం చూసినప్పుడు చాలా సంతోషమేసింది. చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మా గృహ ప్రవేశాల పండుగకు రావాలి. దేవుడంటే ఎవరు అడిగిన వరాలిచ్చేవారు కానీ నా కుటుంబంలో నేను ఏదీ అడక్కుండానే, ఏదీ కోరుకోకుండానే అన్ని వరాలిచ్చిన మీరే నా ప్రత్యక్ష దైవం, మీరు ఉదయించే సూర్యుడు.. మీరు ఒక ప్రభంజనం.. మా మహిళలకు ఒక ధైర్యం, భరోసా, బలగం మీరు. మీరే మళ్లీ సీఎంగా రావాలి. మా ఓట్లు మీకే, మీ చల్లని పాలన సుస్ధిర కాలం ఉండాలి.
లక్ష్మీ, లబ్ధిదారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు: ఎమ్మెల్యే ఆర్కే
అందరికీ నమస్కారం, అన్నా ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలు 32 లక్షల మందికి ఇళ్ళస్ధలాలు ఇచ్చి అందులో లక్షల మంది నివాసాలు ఉంటుంటే, మా రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేదని పేదలు ఎదురుచూశారు, వీరందరికీ మీ దయ వల్ల పట్టాలు అందుతున్నాయి, ఈ పేదలంతా మీకు శాశ్వతంగా రుణపడి ఉంటారు. చంద్రబాబు ఈ రోజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం ఈడబ్యూఎస్ కి ఇవ్వాలని పెట్టినా, ఆయనకు పేదల మీద ప్రేమ, అభిమానంతో పెట్టలేదు.
తప్పనిసరిగా ఇవ్వాలని కాబట్టి 5 శాతం రిజర్వ్ చేసి కట్టలేదు. దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తాం అన్న చంద్రబాబు ఈ రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇల్లు ఎందుకు కట్టించాలి, ఇక్కడ పేదలు దళితులు ఉంటే ఇది రాజధాని కాదన్నాడు, చివరికి సమాధులతో సైతం పోల్చాడంటే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీరు పట్టాలిస్తున్న వారంతా త్వరలోనే గృహప్రవేశం చేస్తారు.
ఈ పేదలంతా సంక్రాంతి నాటికి ఆ పండుగ ఈ ఇళ్ళలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను, మీ చేతుల మీదుగా సంక్రాంతినాడు గృహప్రవేశం జరుపుకునేలా ఉండాలి, ఈ రాజధాని ప్రాంతంలో కులం, మతం గురించి మాట్లాడారు, నా కులం మానవత్వం. నా మతం సమానత్వం అనే ధైర్యాన్ని ఈ పేదలలో నింపాలని కోరుకుంటున్నాను. పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు. ఇల్లు లేని నిరుపేదలకు తెలుసు ఆ భాదలేంటో, ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్న మాటను నిలబెట్టుకుంటూ దేశానికి మీరు ఆదర్శంగా నిలవాలి. ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఏబీఎన్ చానల్‌లో ఆర్ 5 జోన్ ఆరిపోయే జోన్ అన్నారు, వారికి సంక్రాంతి పండుగ ఈ ఇళ్ళలో జరుపుకుని నిరూపించాలి. శాసన రాజధానికి నిండైన అర్ధం తీసుకొచ్చారు, ధన్యవాదాలు.
-ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే
అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ: మంత్రి ఆదిమూలపు సురేష్
అందరికీ నమస్కారం, పేదలను పెద్దోళ్ళుగా చూడాలన్న సీఎంగారి సంకల్పం ముందు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పటాపంచలు అయిన రోజు, పేదలకు పట్టాలతో పట్టాభిషేకం, ఇది ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు, 51 వేల పట్టాలు అన్ని హంగులతో ఇస్తున్న రోజు, వీటితో పాటు పట్టణ ప్రజలకు రూపాయికే ఇల్లు అని ప్రకటించిన విధంగా లక్ష ఇళ్ళు సిద్దం చేయడంతో పాటు 2,63,000 ఇళ్ళు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాం. 8 లొకేషన్లలో 5,000 ఇళ్ళను సీఎంగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్న పండుగ రోజు. ఇవి ఇళ్ళు కాదు ఊళ్ళు, జగనన్న తలపెట్టిన మహాయజ్జాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. పేదలకు పట్టాలివ్వడంపై సుప్రిం ఉత్తర్వులే ఒక నిదర్శనం.
చదవండి: మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్
పేదల కోసం ఎంతదూరమైనా వెళతాననే జగనన్న మరోసారి నిరూపించారు. బడుగు బలహీనవర్గాలు, అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, చంద్రబాబు వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోరు, అమరావతి పరిధిలో సామాజిక సమతుల్యం జరుగుతుంది. ఇది జగనన్నకు మాత్రమే చెల్లింది, రాబోయే రోజుల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగనన్న ఉక్కు సంకల్పం ముందు అవన్నీ పటాపంచలు అవుతాయి, ఈ స్ధలాలను సమాధులతో పోలుస్తున్నారు, చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మీకు దళితులు రాజకీయ సమాధి కడతారు. జగనన్నే మా నమ్మకం. మా భవిష్యత్, మళ్ళీ మళ్ళీ మీరే సీఎం అని మనం ఎలుగెత్తి చాటుదాం. ధ్యాంక్యూ.
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: మంత్రి మేరుగ నాగార్జున
నమస్కారం, ఈరోజు సామాజిక న్యాయానికి పండుగ రోజు, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో ఇళ్ళస్ధలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు, ధర్నాలు చేసేవి, కానీ అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, వారు చంద్రబాబు పంచన చేరి ఇళ్ళస్ధలాలు ఇక్కడ వద్దంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారు, ఆయన్ను రాబోయే రోజుల్లో ఈ పేదలు వెంటబడి తరుముతారు. పేదల ఇళ్ళ స్ధలాలు ఇవ్వకూడదని కోర్టులకెళ్ళారు, పేదలకు అండగా ఉండాలని సీఎంగారు ముందుకెళుతున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటున్నారు, ఆరునూరైనా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతున్నారు, ప్రజాస్వామ్యవాదులంతా జగన్ గారిని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జగనన్నా మేమంతా మీ వెంటే: మంత్రి జోగి రమేష్
పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగిన యుద్దంలో సుప్రిం సైతం పేదల పక్షాన నిలబడితే, పేదలకు ఇళ్ళస్ధలాలు వద్దు అని పెత్తందార్ల పక్షాన నిలబడ్డ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు. 31 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తుంటే దానిని అడ్డుకుంటున్నారు, రాజధానిలో పేదలు నివసించకూడదని, పేదలు పాలేర్లుగా ఉండాలనే విధంగా సుప్రింకు వెళ్ళారు. చంద్రబాబు పెత్తందార్ల పక్షాన ఉంటే మన జగనన్న పేదల వెంట ఉన్నారు, జగనన్నా మేమంతా మీ వెంటే ఉంటాం. 2024లో మరోసారి సీఎం చేద్దాం, మనమంతా జగనన్న వెంట ఉందాం.
Comments
Please login to add a commentAdd a comment