సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు
80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి
గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు.
మహాక్రతువు ముందుకే..
రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్‌లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి.
సకల సదుపాయాలతో..
కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు.
‘పట్టా’భిషేకాల కోలాహలం
Published Wed, Jan 20 2021 3:45 AM | Last Updated on Wed, Jan 20 2021 3:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment